ముందుగా జగన్ ఫలితాలు రాగానే ప్రశాంత్ కిశోర్ అండ్ కోను అభినందించారు. ఆయన వల్లే ఇదంతా అన్న కృతజ్ఞత ఒకటి వెల్లడించారు. నేరుగానే ప్రభుత్వం ఏర్పాటు చేయడం సులువు కనుక జగన్ ఆనందాలకు అవధులే లేకుండా పోయాయి. 151 సీట్లు సాధించి చంద్రబాబు వర్గాలకు కేవలం 23 సీట్లే మిగిల్చి వెళ్లారు.
ఈ పరిణామంతో చంద్రబాబు ఖంగుతిన్నారు. టీడీపీ జిల్లా మరియు రాష్ట్ర కార్యాలయాలన్నీ కార్యకర్తల్లేక వెలవెలబోయాయి. అదేవిధంగా జనసేనలోనూ విపరీతం అయిన నిరాశ ఒకటి నెలకొంది. గెలిచిన వారంతా ఊరేగింపులకు బయలు దేరారు.కొన్ని చోట్ల ర్యాలీలకు అనుమతే లేదని పోలీసులు అడ్డుకుంటే కొందరు అధికార పార్టీ నాయకులు ఆగ్రహంతో ఊగిపోయారు.
తరువాత ఏమయిందంటే..
జగన్ ముఖ్యమంత్రి మే 302019న ప్రమాణ స్వీకారం చేశారు. జగన్ అనే నేను అనే పదం రెండు సార్లు పలికి తనవాళ్లలో సంతోషం నింపారు. తనవారి కళ్లల్లో ఆనందం నింపారు. ఆ రోజు వేడుక అనంతరం కొన్ని పథకాలకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. క్యాబినెట్ కూర్పులో సీనియర్ అయిన ధర్మాన ప్రసాదరావుకు చోటు లేకుండా చేశారు.
అదే మొదటి ఝలక్ జగన్ నుంచి అందుకున్నారు నాటి ధర్మాన. ప్రసాదరావు అన్నయ్య ధర్మాన దాసన్నకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారు. అలానే ఉత్తరాంధ్ర కు చెందిన జగనన్న విధేయురాలు పాముల పుష్ప శ్రీవాణికి కూడా అనూహ్యంగా పదవి వచ్చింది. అవంతి శ్రీను కూడా అలానే అనూహ్య రీతిలో పదవి అందుకుని వివాదాల్లోకి వెళ్లిపోయారు. ఇవన్నీ ఎలా ఉన్నా అప్పటి నుంచి ఇప్పటివరకూ ఉత్తరాంధ్ర వరకూ అదే హవాను నడుపుతూ వెళ్తున్నారు బొత్స.
ఇప్పుడేం జరుగుతుందంటే..
మార్పుల్లో భాగంగా కొత్త మంత్రులు వచ్చి చేరారు. అప్పటిదాకా అసంతృప్తితో ఉన్న విడదల రజనీకీ రోజాకూ ధర్మాన ప్రసాదరావుకూ పదవులు వచ్చేయి. వాటితో పాటు బాధ్యతలూ అందాయి. అంబటికీ పదవి వచ్చింది. ఇప్పుడు వీరంతా హ్యాపీ గానే ఉన్నారు. మళ్లీ ఎన్నికలు వస్తే వీళ్లంతా గెలుస్తారా ? ఇదే సందేహం జగన్ లోనూ ఉంది ! ఏమౌతుందో ఇక !