చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో దావోస్‌కి వెళితే.. ఆ దావోస్ పెద్ద నాటకం. అదే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో దావోస్‌కి వెళితే, పెట్టుబడులు రాష్ట్రానికి వెల్లువలా వచ్చేస్తాయ్. ఇదీ వైసీపీ మార్కు సిద్ధాంతం.!
‘చంద్రబాబు అమరావతి పేరుతో పబ్లిసిటీ స్టంట్లు చేశారు.. మేం అధికారంలోకి వస్తే, కేంద్ర సహకారం లేకున్నా.. అభివృద్ధి చేస్తాం. అమరావతిని అభివృద్ధి చేయడానికి మా సొంత ప్రణాళికలు వున్నాయ్..’ అని సాక్షాత్తూ వైఎస్ జగన్ ప్రతిపక్ష నేత హోదాలో చెప్పారు. వైఎస్ జగన్ చెప్పారంటే, చెయ్యరంతే.. అనడానికి అమరావతి ఓ నిలువెత్తు నిదర్శనం.
సరే, పాత విషయాలు పక్కన పెట్టి, దావోస్ గురించి మాట్లాడుకుందాం. వరల్డ్ ఎకనమిక్ ఫోరం.. దావోస్‌లో జరుగుతుంటుంది. వివిధ దేశాలకు చెందిన పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో పాల్గొంటారు. ఈ క్రమంలో పెట్టుబడుల్ని ఆకర్షించేందుకు ఆయా దేశాలు, రాష్ట్రాలు.. తమ తాత్కాలిక ‘దుకాణాల్ని’ అక్కడ తెరుస్తాయ్.
అవగాహనా ఒప్పందాలైతే అక్కడ కుదురుతాయ్. కానీ, అవి కార్యరూపం దాల్చడం అంత తేలిక కాదు. దాదాపు లక్షన్నర కోట్ల రూపాయల మేర అవగాహనా ఒప్పందాలు కుదిరాయన్నది వైఎస్ జగన్ దావోస్ పర్యటనపై ప్రభుత్వ వర్గాలు చెబుతున్నమాట. నిజమేనా.? ఆ స్థాయిలో ఒప్పందాలు కుదిరాయా.? అంటే, ముఖ్యమంత్రి అధికారికంగా పెదవి విప్పాలి.
‘ముఖ్యమంత్రి వచ్చారు గనుక.. విపక్షాలకు చాకిరేవు ఖాయం..’ అని బులుగు మీడియా అంటోంది. విపక్షాలకు చాకిరేవు పెడతారో.. ఇంకేదన్నా చేసుకుంటారో.. జనానికి అయితే చాకిరేవు తప్పడంలేదు.. పన్నుల బాదుడు కారణంగా. ఆ సంగతి పక్కన పెట్టి, లక్షన్నర కోట్లలో రాష్ట్రానికి ఎంత మొత్తం నిధులు పెట్టుబడుల రూపంలో వస్తున్నాయో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు వివరించాలి.
ఎందుకంటే, ప్రజాధనం చాలానే ఖర్చయ్యింది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దావోస్ పర్యటన నిమిత్తం. ఆ ఖర్చు అయినా, పెట్టుబడుల రూపంలో రాష్ట్రానికి వస్తుందా.? అన్నదానిపై ముఖ్యమంత్రి స్పష్టతనివ్వకపోతే ఎలా.?