ఇంకోపక్క విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అట. కర్నూలు న్యాయ రాజధాని అట. ప్రస్తుతానికైతే, రాష్ట్రానికి రాజధాని అమరావతి మాత్రమే. కానీ, అసెంబ్లీలో మూడు రాజధానులకు అనుకూలంగా బిల్లు పాస్ అయిపోయింది. అది శాసన మండలిలో ఆగిపోవడంతో.. ఏకంగా శాసన మండలిని రద్దు చేయడానికి వైఎస్ జగన్ ప్రభుత్వం సంకల్పించింది.
ఏదో ఒకటి, ఆంధ్రప్రదేశ్‌కి రాజధాని అంటూ ఖచ్చితంగా వుండాలి. ఆ రాజధాని విషయంలో పాలకులకు స్పష్టత వుండాలి. ఆంధ్రప్రదేశ్ కంటే అభివృద్ధిలో వెనుకబడి కొన్ని రాష్ట్రాలు వున్నాయేమోగానీ.. రాజధాని విషయంలో ఇంత గందరగోళంతో దేశంలో ఏ రాష్ట్రమూ లేదన్నది నిర్వివాదాంశం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి, ఏడాది పాలనను పూర్తి చేసుకున్నారు.. మరోవైపు హై కోర్టు నుంచి ఎన్ని మొట్టికాయలు పడుతున్నా వైసీపీ శ్రేణులు మాత్రం అవేం పట్టనట్టు ఓ మేరకు సంబరాలు చేసుకుంటున్నాయి.
మరి, రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏంటి.? తమ రాజధాని ఏదో తెలియని అయోమయం రాష్ట్ర ప్రజలకు ఇంకెన్నాళ్ళు.? కరోనా మహమ్మారి వచ్చి వుండకపోతే, విశాఖ కేంద్రంగా పరిపాలనను ఇప్పటికే వైఎస్ జగన్ ప్రారంభించి వుండేవారన్న చర్చ వైసీపీ వర్గాల్లో జరుగుతోంది. ఇదెంత నిజం.? అమరావతి నుంచి రాజధాని విశాఖకు తరలి వెళ్ళిపోతుందా.? వైసీపీ మంత్రులు చెప్పినట్లు అమరావతి నిజంగానే స్మశానమా.? అలాగైతే, అక్కడి నుంచే ఇంకా ఎందుకు పరిపాలన కొనసాగుతున్నట్లు.? ఇలా సవాలక్ష ప్రశ్నలు.. సమాధానాలే దొరకడంలేదు.
ఆంధ్రప్రదేశ్‌కి ప్రస్తుతం రాజధాని లేదని ఎవరూ అనలేరు. ఎందుకంటే, అమరావతే అధికారికంగా ఆంధ్రప్రదేశ్‌కి రాజధాని. కానీ, మూడు రాజధానుల చుట్టూ అధికార పార్టీ చేస్తున్న యాగీ నేపథ్యంలో.. ఇంకెన్నాళ్ళు రాజధాని విషయంలో గందరగోళం కొనసాగుతుందో తెలియక రాష్ట్ర ప్రజానీకం ఆవేదన చెందాల్సి వస్తోంది. మొత్తమ్మీద, ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆవేదనకు వైఎస్ జగన్ తన రెండో ఏడాది పాలన పూర్తయ్యే లోపు అయినా సమాధానమిస్తారో లేదో వేచి చూడాల్సిందే.