ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

స్వపక్షంలో విపక్షంపై జగన్ ఫోకస్ చేయట్లేదా?

సీఎం జగన్ నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం ఏడాది పాలనను పూర్తి చేసుకుంది. వైసీపీ పాలనపై ఏపీ ప్రజల్లో చాలామంది సంతృప్తి వ్యక్తం చేశారని ఆ పార్టీ నేతలు ప్రకటించుకున్నారు. తమది ప్రజా ప్రభుత్వం అని సీఎం జగన్ జనరంజక పాలన అందిస్తున్నారని చెప్పుకుంటున్నారు. తమ ముఖ్యమంత్రి రైతుల పక్షపాతి అని…తమ ప్రభుత్వం అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తోందని అంటున్నారు. కొన్ని విషయాలు మినహా జగన్ పాలన పట్ల ప్రజల్లోను పెద్దగా అసంతృప్తి లేదు. ఇదంతా నాణేనికి ఓ వైపు. నాణేనికి మరోవైపు….జగన్ పాలనపై విపక్షాలతో పాటు స్వపక్షంలోని కొందరు ఎమ్మెల్యేలు కూడా పెదవి విరుస్తున్నారు.

అంతేకాదు, సొంత పార్టీపైనే కొందరు ఎమ్మెల్యేలు విమర్శలు గుప్పించారు. సారా విషయంలో స్పీకర్ తమ్మినేని సీతారాం, ఇసుక విషయంలో పల్లం బ్రహ్మనాయుడు, నీళ్ల విషయంలో మహీధర్ రెడ్డి ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తంచేశారు. తాజాగా, ఆ జాబితాలోకి సీనియర్ పొలిటిషియన్ ఆనం రామ నారాయణ రెడ్డి చేరారు. ఈ ఏడాది పాలనలో తన సొంత నియోజకవర్గం వెంకటగిరికి ఏమీ చేయలేకపోయానని ఆనం ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం చెప్పిన మాటను సైతం అధికారులు వినడం లేదని, జలవనరుల శాఖలోని అధికారులే నీళ్లను అమ్ముకుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

తాను, ఎన్నోసార్లు ఎమ్మెల్యేగా పని చేశానని, మంత్రిగానూ బాధ్యతలను నిర్వర్తించానని చెప్పిన ఆనం….ఇటువంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే పదవి తనకు అలంకారప్రాయం కాదని, జిల్లా అధికారుల తీరు దారుణంగా ఉందని ఆనం అసహనం వ్యక్తం చేశారు. వెంకటగిరి నియోజకవర్గాన్ని అధికారులు మర్చిపోయారని, తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇంత దారుణమైన పరిస్థితులు ఎప్పుడూ చూడలేదని ఆనం అన్నారు.

తన నియోజకవర్గ ప్రజలకు నేరుగా అందే సంక్షేమ కార్యక్రమాలు తప్ప…మిగతా ఏ కార్యక్రమాలనూ తాను చేయలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్ ఆదేశాలను కూడా అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల కోసం తాను ఏమీ చేయలేకపోతున్నానని, ప్రభుత్వ యంత్రాంగం ఇంత దారుణంగా పని చేయడం తన 40 ఏళ్ల రాజకీయ అనుభవంలో ఎప్పుడూ చూడలేదన్నారు. జలవనరుల శాఖలోని అధికారులే నీళ్లను అమ్ముకుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం మంత్రులకు ఇచ్చిన డీపీఆర్ లు ఎక్కడున్నాయో కూడా తనకు తెలీదన్నారు.

స్వపక్షంలోనే విపక్షంపై జగన్ ఫోకస్ చేయడం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తమ్మినేని, పల్లం బ్రహ్మనాయుడు, మహీధర్ రెడ్డి, ఆనం..ఇలా బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేసిన నేతలు కొందరైతే….కక్కలేక మింగలేక మరి కొంతమంది నేతలున్నారని అంటున్నారు. విపక్షాల సంగతి పక్కనపెడితే…సొంత పార్టీ నేతలు సంధిస్తున్న ప్రశ్నలపై జగన్ సీరియస్ గా దృష్టి సారించాల్సిన అవసరముందని చెబుతున్నారు.

అధికారులకు జగన్ స్వేచ్ఛనిచ్చారని….దాని వల్ల కొందరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు అసహనం వ్యక్తం చేస్తున్నారన్న వాదన ఉంది. గత ప్రభుత్వంలో చంద్రబాబు ఇదే తరహా పొరపాటు చేశారన్న విమర్శలున్నాయి. మరి, జగన్ ఈ విషయంపై ఫోకస్ చేయకుంటే….నివురుగప్పిన నీరులా ఉన్న ఎమ్మెల్యేల అసహనం…భవిష్యత్తులో దావానలం అవుతుందేమోనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Exit mobile version