ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

16 కోట్ల మాస్క్‌లు.. వైఎస్‌ జగన్‌ పబ్లిసిటీ స్టంట్‌ కెవ్వు కేక

ఒకటి కాదు.. రెండు కాదు.. వెయ్యి కాదు.. లక్ష కాదు.. ఏకంగా 16 కోట్ల మాస్క్‌ల్ని రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేయనుంది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అధికారుల్ని ఆదేశించారు కూడా. ఇంకా మాస్క్‌ల పంపిణీ ప్రక్రియ ప్రారంభం కాలేదుగానీ, అప్పుడే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సోషల్‌ మీడియాలో ‘భజన’ షురూ చేశారు. ‘ప్రపంచంలోనే ఎక్కడా ఏ ప్రభుత్వమూ తీసుకోని నిర్ణయమిది..’ అంటూ హడావిడి మొదలెట్టేశారు. పనిలో పనిగా ఎల్లో మీడియాపైనా, విపక్షాలపైనా విరుచుకుపడిపోయారు.

నిజానికి, ఇది మంచి నిర్ణయమే. ప్రజలకు ప్రభుత్వం తరఫున ఏం చేసినా అభినందించి తీరాల్సిందే. కానీ, ‘మాస్క్‌’ల పేరుతో పబ్లిసిటీ స్టంట్స్‌ మొదలెట్టడమ్మీదనే చాలామందికి చాలా అనుమానాలు కలుగుతున్నాయి. మొన్నామధ్య కరోనా సాయం పేరుతో పేద కుటుంబాలకు వెయ్యి చొప్పున ఆర్థిక సహాయం అందించింది వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం. ‘ఇది జగనన్న కానుక.. వైసీపీకే స్థానిక ఎన్నికల్లో ఓటేయండి..’ అని పబ్లిసిటీ చేసుకున్నారు వైసీపీ నేతలు.

మరోపక్క, శానిటైజర్‌ డబ్బా మీద వైఎస్‌ జగన్‌ ఫొటోలతో హల్‌చల్‌ చేశారు. ఏమో, ఇప్పుడీ మాస్క్‌లు కూడా వైసీపీ జెండా రంగులతో తయారు చేస్తారేమో.! అంతా బాగానే వుందిగానీ, ఓ వైద్యుడు, ఓ మునిసిపల్‌ కమిషనర్‌.. మాస్క్‌లు లేవు, సరైన రక్షణ వ్యవస్థ లేదు.. అంటూ కరోనా వైరస్‌ విషయమై ప్రభుత్వాన్ని నిలదీసినందుకు వాళ్ళని సస్పెండ్‌ చేసేసింది జగన్‌ ప్రభుత్వం.

కరోనా వైరస్‌ నేపథ్యంలో స్థానిక ఎన్నికల్ని వాయిదా వేస్తే, ఏకంగా రాష్ట్ర ఎన్నికల అధికారినే పీకి పారేసింది జగన్‌ సర్కార్‌. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ మహమ్మారి విషయంలో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వానికి వున్న చిత్తశుద్ధి ఇది. ప్రజల పట్ల ప్రభుత్వానికి వున్న బాద్యత ఇది.

కరోనా వైద్య చికిత్స అందిస్తున్న వైద్యుల పట్ల, కరోనా వైరస్‌ నేపథ్యంలో ప్రజలకు సేవ చేస్తున్న అధికారులపైనా.. ప్రభుత్వం చూపిస్తున్న చిత్తశుద్ధి ఏంటో చూస్తూనే వున్నాం. ముందు వైద్యులకు అవసరమైన మాస్క్‌లు, కిట్లు ప్రభుత్వం ఇవ్వగలిగితే.. ఆ తర్వాత 16 కోట్ల మాస్క్‌ల గురించి ఆలోచించొచ్చు.

Exit mobile version