ఇక, మరో పక్క కేంద్రంలోని మోడీ సర్కార్ కు అనుకూలంగా ఉంటూనే రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాబడుతున్నారు. ఇటువంటి నేపథ్యంలో జగన్ తాజాగా తీసుకున్న ఓ నిర్ణయంతో ఒకే దెబ్బకు మూడు పిట్టలు కొట్టినట్లయింది. దేశంలో ప్రఖ్యాత పాల ఉత్పత్తుల కంపెనీ అమూల్‌తో చేసుకున్న ఒప్పందంతో జగన్ మూడు రకాలుగా లాభపడ్డట్లయింది.
చంద్రబాబు కుటుంబానికి ప్రధాన ఆదాయ వనరు హెరిటేజ్ కంపెనీ. అటువంటి హెరిటేజ్ కంపెనీకి చెక్ పెట్టేలా ప్రముఖ సంస్థ అమూల్ తో జగన్ జత కట్టారు. అమూల్‌తో జగన్ సర్కారు చేసుకున్న ఎంవోయూతో బాబు ఆర్థిక మూలాలకు మూలస్తంభమైన హెరిటేజ్‌కు గట్టి దెబ్బ తగిలిందని అనుకుంటున్నారు. దీంతో, హెరిటేజ్ కు చెక్ పెట్టడంతో బాబు ఆర్థిక మూలాల్లో ఒకదానిపై కొంత ప్రభావం పడే అవకాశముంది.
ఏపీలో పాల వ్యాపారంలో హెరిటేజ్ కు పోటీగా అమూల్ రావడంతో కొంత నష్టం వాటిల్లే చాన్స్ ఉంది. ఇక, గుజరాత్ కు చెందిన అమూల్ ను ఆదరించి గుజరాతీ అయిన ప్రధాని మోడీ మనసును గెలుచుకున్నారు జగన్. మరోవైపు, దేశవ్యాప్తంగా పాపులర్ అయిన అమూల్ తో ఏపీ సర్కార్ ఒప్పందం వల్ల పాడి రైతుల్లో సానుకూలత వచ్చే అవకాశముంది. ఈ రకంగా జగన్…ఒక దెబ్బకు మూడు పిట్టలను కొట్టినట్లయింది.
చంద్రబాబు హయాంలో ప్రభుత్వ కార్యకలాపాల్లో, ప్రజలకు ఉచితంగా పాల ఉత్పత్తుల పంపిణీలో హెరిటేజ్ ఉత్పత్తులు దర్శనమిచ్చేవి. ప్రభుత్వ పరంగా పాల ఉత్పత్తుల కొనుగోళ్ళు, అంగన్ వాడి స్కూళ్ళు, హాస్టళ్లు, బహిరంగ సభలు సమావేశాలకు హెరిటేజ్ నుంచే కొనుగోళ్ళు జరిగేవి. ఆయా కార్యక్రమాల్లో హెరిటేజ్ ఉత్పత్తులు, హెరిటేజ్ ఫ్రెష్ లోని వస్తువులను వాడేలా ప్రభుత్వంతో హెరిటేజ్ కు ఒప్పందం ఉంది. తాజాగా అమూల్ తో ఒప్పందం వల్ల హెరిటేజ్ కు ఎదురుదెబ్బ తగిలినట్లయింది.
అమూల్ కు ప్రభుత్వ సహకారం, సహకార రంగానికి వర్తింపజేసే అన్నిరకాల ప్రోత్సాహకాల్ని జగన్ అందించే అవకాశముంది. అప్పుడు అమూల్ తో హెరిటేజ్ కు గట్టి పోటీ ఏర్పడుతుంది. ఈ పోటీతో పాటు ప్రభుత్వ కార్యక్రమాల్లో హెరిటేజ్ ఉత్పత్తులు ఉండకపోవచ్చు. కాబట్టి, చంద్రబాబుకు చెందిన హెరిటేజ్ వ్యాపారపరంగా కొంత నష్టపోయే అవకాశముంది.