ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

వైఎస్‌ జగన్‌కి రాజుగారి కొత్త లేఖాస్త్రం: ఈసారి అయోధ్యపై.!

‘నన్ను ఇంకా పార్టీ నుంచి సస్పెండ్‌ చేయలేదు.. నేనింకా యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీ నేతనే.. నాకు పార్టీ పట్ల, పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ పట్ల అపారమైన ప్రేమాభిమానాలు వున్నాయి..’ అంటూనే, వైఎస్సార్సీపీ మీద తనదైన స్టయిల్లో మాటల యుద్ధంతోపాటు లేఖాస్త్రాల యుద్ధం కూడా చేస్తున్నారు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీ పేరుకే ‘ఎసరు’ పెట్టేలా రఘురామకృష్ణరాజు రాజకీయ వ్యూహాలు కన్పిస్తున్న విషయం విదితమే. ఇక, అసలు విషయానికొస్తే, రఘురామకృష్ణరాజు మరో తాజా లేఖాస్త్రంతో వైఎస్సార్సీపీకి షాకిచ్చారు.

ఆగస్ట్‌ 5వ తేదీన అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి శంకుస్థాపన జరగనున్న దరిమిలా, రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు చేయించాలంటూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డికి రాసిన లేఖలో పేర్కొన్నారు రఘురామకృష్ణరాజు. ‘దేశంలోని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆహ్వానాలు వెళుతున్న నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా మీరు కూడా ఈ అత్యద్భుత కార్యక్రమానికి హాజరవ్వాలని ఆకాంక్షిస్తున్నాను..’ అంటూ నర్సాపురం ఎంపీ తన లేఖాస్త్రంలో కోరడం గమనార్హం. అంతే కాదు, ఎస్వీబీసీ ఛానల్‌లో అయోధ్య రామ మందిర శంకుస్థాపన కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసేలా చర్యలు తీసుకోవాలని కూడా కోరారు రఘురామకృష్ణరాజు. కానీ, ఇదంతా సాధ్యమయ్యే పనేనా.? పైగా, పార్టీకి చెడ్డ పేరు తెచ్చేలా వ్యవహరిస్తున్న రఘురామకృష్ణరాజు చెబితే, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ వింటారా.? అన్నిటికీ మించి ఎవర్నయితే అనర్హుడిగా ప్రకటించాలని వైఎస్సార్సీపీ అధినాయకత్వం సూచన మేరకు వైసీపీ ఎంపీల బృందం లోక్‌సభ స్పీకర్‌కి విజ్ఞప్తి చేసిందో ఆ ఎంపీ చెప్పినట్లు ముఖ్యమంత్రి నడుచుకునే అవకాశం వుంటుందా.?

ఇవన్నీ నిజానికి జరిగే వ్యవహారాలు కావు. అది తెలిసీ, రఘురామకృష్ణరాజు తనదైన స్టయిల్లో ‘పొలిటికల్‌ గేమ్’ షురూ చేశారు. నిజానికి, వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖాస్త్రంలో తప్పు పట్టడానికి ఒక్క అక్షరం కూడా కన్పించదు. కానీ, తప్పు పట్టలేని దుస్థితి వైసీపీ నేతలది. ఆయన గేమ్ ప్లాన్‌ అలాంటిది మరి.!

Exit mobile version