ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

హైకోర్టు ఇలాంటి షాక్ ఇస్తుందని జగన్ సర్కారు ఊహించి ఉండదు

ఆంధ్రప్రదేశ్‌లో గత ఏడాది వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఆలస్యం.. కనిపించిన ప్రతి ప్రభుత్వ భవనానికీ ఆ పార్టీ రంగులు వేసేయడం మొదలైంది. చివరికి స్కూళ్లకు.. వాటర్ ట్యాంకులకు.. బోరింగ్ పంపులకు కూడా పార్టీ రంగులు పులిమేశారు. దీనిపై ఎన్ని విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గలేదు.

ఓ చోట మహాత్ముడి విగ్రహం ఉన్న దిమ్మెకు.. జాతీయ జెండా రంగులున్న భవనానికి కూడా వైకాపా రంగులు పడిపోయాయి. దీనిపై కోర్టుల్లో కేసులు దాఖలవడం.. హైకోర్టు జగన్ సర్కారుకు మొట్టికాయలు వేయడం తెలిసిన సంగతే. పంచాయితీ కార్యాలయాలన్నింటికీ వైకాపా రంగులు వెంటనే తొలగించాలని హైకోర్టు ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేసింది. ఐతే ప్రస్తుతం కరోనా ప్రభావంతో రాష్ట్రంలో ఏ పనులూ చేపట్టే అవకాశం లేదని.. ఇందుకు మూడు నెలల గడువు ఇవ్వాలని జగన్ సర్కారు కోర్టుకు విన్నవించింది.

కానీ హైకోర్టు అందుకు ససేమిరా అనేసింది. దీనిపై కోర్టులో ఆసక్తికర వాదనలు జరిగాయి. కోర్టు జగన్ సర్కారును ఇరుకున పెట్టే వ్యాఖ్యలు చేసింది. మీరు కోరుతున్నట్లు రంగులు తొలగించడానికి మూడు నెలల గడువు ఇస్తాం.. అప్పటిదాకా స్థానిక సంస్థల ఎన్నికల్ని వాయిదా వేస్తారా అని అడిగింది. దీంతో ప్రభుత్వ తరఫు న్యాయవాదికి ఏం చెప్పాలో అర్థం కాలేదు.

లాక్ డౌన్ ఎత్తేశాక ఈ రంగులు తొలగించి కొత్త రంగులేయడానికి ఎంత సమయం పడుతుందో అధికారుల నుంచి సమాచారం తెలుసుకుని కోర్టుకు చెబుతామని వివరించారు. ఐతే పంచాయితీ కార్యాలయాలకు వైకాపా రంగులు ఉండగానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించి ప్రయోజనం పొందాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇలా మూడు నెలల గడువు కోరినట్లు తెలుస్తోంది.

ఈ ఎన్నికలు నిర్వహించే విషయంలో జగన్ సర్కారు ఎంతగా తహతహలాడిపోతోందో అందరికీ తెలిసిందే. రంగులు తీశాకే ఎన్నికలు నిర్వహించాలని తర్వాతి విచారణ సందర్భంగా కోర్టు తీర్పు ఇచ్చినా ఆశ్చర్యం లేదేమో.

Exit mobile version