గతంలో చంద్రబాబు పార్టీ ఫిరాయింపుల్ని రాజకీయ వ్యభిచారంగా అభివర్ణించి.. ఆయనా పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహించారు. అదే బాటలో ఇప్పుడు వైఎస్ జగన్ నడుస్తున్నారు. ‘వైఎస్ జగన్ రాజీనామా చేయమని ఆదేశిస్తే, తక్షణం రాజీనామా చేసేస్తాం..’ అంటూ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ తదితరులు చెబుతున్నారు. ఇక, ఆయా నియోజకవర్గాల్లో పార్టీనే నమ్ముకున్న వైసీపీ నేతలు మాత్రం, ఈ ఫిరాయింపుల పర్వంపై తీవ్రంగా ఆందోళన చెందుతున్నారట.
చంద్రబాబు హయాంలో ఎంతమంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారో, అంతేమంది ఎమ్మెల్యేలు ఆ పార్టీకి 2019 ఎన్నికల్లో దక్కారు. ఈ లెక్కన, 2024 నాటికి అదే సెంటిమెంట్ రిపీట్ అయితే వైసీపీ పరిస్థితి ఏంటి.? ఓ డజను ఎమ్మెల్యే సీట్లు అయినా వైసీపీకి వస్తాయా.? రావా.? అన్న చర్చ జరుగుతోందట వైసీపీలో.
‘అప్పటి పరిస్థితులు వేరు.. ఇప్పటి పరిస్థితులు వేరు. రాష్ట్రంలో వైసీపీకి ప్రత్యామ్నాయమే లేదు..’ అంటూ వైసీపీ నేతలు కొంత ‘అతివిశ్వాసం’ ప్రదర్శిస్తున్నారు. కానీ, రాజకీయాల్లో ఈక్వేషన్స్ మారిపోవడానికి పెద్దగా సమయం అవసరం లేదు. జాతీయ స్థాయిలో క్రిమినల్ కేసులున్న రాజకీయ నాయకులపై ‘వేటు’ అనే చర్చ జరుగుతున్న దరిమిలా.. రాష్ట్ర రాజకీయాలు రాత్రికి రాత్రి మారిపోయే అవకాశముందన్నది రాజకీయ పరిశీలకుల అంచనా.
మరి, ఫిరాయింపు పాపం చంద్రబాబుని వెంటాడినట్లు, వైఎస్ జగన్‌ని కూడా వెంటాడుతుందా.? వేచి చూడాల్సిందే.