సాక్షాత్తూ వైసీపీ నేతలు కొందరు, న్యాయ వ్యవస్థపై తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టు తాజా హెచ్చరికలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ‘న్యాయ వ్యవస్థపై నమ్మకం లేదా.? హైకోర్టుపైనే తీవ్ర వ్యాఖ్యలు చేస్తారా.? హైకోర్టుని రద్దు చేసెయ్యమని పార్లమెంటుని అడగండి..’ అంటూ రాష్ట్ర హైకోర్టు ఈ రోజు చాలా సీరియస్‌గా వ్యాఖ్యానించింది. ‘జడ్జిలపై జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేస్తున్నా, పోలీసులు పట్టించుకోవడంలేదు. దీని వెనుక బలమైన కారణమే వుండి వుండాలి. ఆ బలమైన శక్తులేంటో మాకు తెలుసు..’ అని న్యాయస్థానం వ్యాఖ్యానించినట్లు మీడియాలో కథనాలు వెల్లువెత్తుతున్నాయి.
‘రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా అమలు కాకపోతే, మేం ప్రత్యేక అధికారాలు వినియోగించాల్సి వుంటుంది..’ అని న్యాయస్థానం వ్యాఖ్యానించిందంటూ ప్రచారం జరుగుతున్న దరిమిలా, అదే నిజమైతే.. జగన్ సర్కార్‌కి అదో పెద్ద తలనొప్పిగా మారనుందన్నది నిర్వివాదాంశం. ఏదిఏమైనా, రాష్ట్రంలో అధికార పార్టీ నేతలకు.. ఏ వ్యవస్థ మీదా సరైన గౌరవం లేకుండా పోతోందని ప్రజాస్వామ్యవాదులు గగ్గోలు పెడుతున్నారు. ఏ అంశం మీద మాట్లాడాల్సి వచ్చినా, కులం.. మతం అనే ప్రస్తావన తీసుకొస్తున్నారు. చివరికి జడ్జిలపైనా, న్యాయవ్యవస్థపైనా ఇవే వ్యాఖ్యలు చేయడానికీ వెనుకాడ్డంలేదు. ఈ పరిస్థితుల్లో హైకోర్టు ఆగ్రహం అర్థం చేసుకోదగ్గదే.!