అయితే, కొత్త కేటాయింపుల అవసరమేముందన్నది ఆంధ్రప్రదేశ్ వాదనగా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ అనేది దిగువ రాష్ట్రం గనుక.. మిగులు జలాలపై పూర్తి హక్కు ఆంధ్రప్రదేశ్‌దే. కానీ, ఇక్కడే పంచాయితీ నడుస్తోంది. గతంలో మిగులు జలాలు ఉమ్మడి తెలుగు రాష్ట్రానికే చెందేవనీ.. ఆ లెక్కన, వాటిల్లో భాగం తెలంగాణకీ దక్కుతుందని తెలంగాణ వాదిస్తోంది. కానీ, అంశాలపై గజేంద్ర షెకావత్ స్పందించలేదు. శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణను తమకు అప్పగించాలని తెలంగాణ కోరితే, ఆ విషయాన్ని కోర్టులు నిర్దేశిస్తాయని షెకావత్ వ్యాఖ్యానించడం గమనార్హం.
ఎలా చూసినా, అపెక్స్ కౌన్సిల్ సమావేశం విషయమై తెలంగాణకు పరిస్థితులు ఏమాత్రం అనుకూలంగా కనిపించలేదు. అదే సమయంలో, ఆంధ్రప్రదేశ్ కొంత మేర తన వాదనలకు మద్దతు కూడగట్టుకోగలిగింది. ఇరు రాష్ట్రాల్లో చేపడుతున్న ప్రాజెక్టుల డీపీఆర్‌లను సమర్థించాలని కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ కోరారు. దీనికి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ అంగీకరించారట. నదీ జలాల పంపిణీపై సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌ని తెలంగాణ ఉపసంహరించుకోవడానికి సిద్ధమని కేసీఆర్ చెప్పారట. ఇది ఇంకో కీలకమైన అంశం కాబోతోంది.
మొత్తమ్మీద, ప్రధాని నరేంద్ర మోడీతో ఈ రోజు ఉదయం భేటీ అయిన వైఎస్ జగన్.. కొంతమేర అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో పై చేయి సాధించగలిగారని నిస్సందేహంగా చెప్పొచ్చు. గజేంద్రసింగ్ షెకావత్ నేతృత్వంలో జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంపై తెలంగాణ నుంచి ఎలాంటి వివరణ వస్తుందో వేచి చూడాల్సిందే.