అయితే, ఈ మొత్తం ఎపిసోడ్‌పై రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ నాగేశ్వర్, న్యాయ కోవిదుడు మాడభూషి శ్రీధర్ మధ్య సంభాషణ జరిగింది. అదిప్పుడు యూ ట్యూబ్‌లో సంచలనంగా మారింది. ఈ ఇద్దరి అభిప్రాయాల పట్ల కొంత సానుకూలత, కొంత వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వైఎస్ జగన్‌కి వ్యతిరేకంగా ఎవరు ఏం మాట్లాడినా, బూతులతో విరుచుకుపడే ‘బూ బ్యాచ్’ ఇక్కడా తమ పైత్యం ప్రదర్శిస్తున్నారు.
అయితే, ఇటు నాగేశ్వర్‌గానీ.. అటు మాడభూషి శ్రీధర్‌గానీ.. వైఎస్ జగన్‌ని తక్కువ చేసి మాట్లాడలేదు. అసలు తమ మధ్య ‘చర్చ’ సందర్భంగా వీరెలాంటి తీర్పునీ ఇవ్వలేదు. ‘ఏం జరగబోతోంది.?’ అన్న విషయమై సాధ్యాసాధ్యాలను మాత్రమే న్యాయ కోవిదుడు మాడభూషి శ్రీధర్ చెప్పారు. ఫిర్యాదులో పేర్కొన్న అంశాల్లో ‘వాస్తవం’ వుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నమ్మితే విచారణ ప్రారంభమయ్యే అవకాశం వుందనీ, లేని పక్షంలో దాన్ని కొట్టి పారేసే అవకాశం వుందని మాడభూషి శ్రీధర్ చెప్పారు.
ఒకవేళ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గనుక, జగన్ ఫిర్యాదుని కొట్టి పారేస్తే, ఆ తర్వాత ఎన్వీ రమణతోపాటుగా, ఎవరెవరి మీదనైతే వైఎస్ జగన్ ఆరోపణలు చేశారో, వారంతా ‘పరువు నష్టం దావా’ వేసే అవకాశం వుంటుందని శ్రీధర్ అభిప్రాయపడ్డారు. ఇదేమీ త్వరగా తేలిపోయే అంశం కాదనీ, ‘ప్రజా ప్రయోజనాల నేపథ్యంలో’ అని వైఎస్ జగన్ ప్రస్తావించిన దరిమిలా, దాన్ని వైఎస్ జగన్ నిరూపించాలనీ, న్యాయమూర్తి మీద చేసిన ఆరోపణల్ని నిరూపించాల్సిన బాధ్యత కూడా వైఎస్ జగన్ మీద వుంటుందని శ్రీధర్ చెప్పుకొచ్చారు.
‘సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కి లేఖ రాయడం తప్పు కాదు. కానీ, దాన్ని పబ్లిక్ డొమైన్‌లో పెట్టడం అనేది పెద్ద సమస్య కావొచ్చు..’ అని శ్రీధర్ పేర్కొన్నారు. ఏదిఏమైనా, ఇది చాలా సున్నితమైన అంశం. ‘సుప్రీంకోర్టు గతంలో కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద 50 రూపాయలు, రూపాయి జరీమానా విధించినట్లే.. వైఎస్ జగన్‌కి కూడా రూపాయో, పది రూపాయలో జరీమానా విధిస్తుందేమో..’ అనే స్థాయికి వెటకారాలు వైఎస్ జగన్ మద్దతుదారుల నుంచి వస్తున్నాయంటే, వ్యవస్థల పట్ల వారికెంత గౌరవం వుందో అర్థం చేసుకోవచ్చు.