ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

ఈ విషయంలో జగన్‌ కంటే చంద్రబాబే నయ్యం.!

పెనం మీద నుంచి పొయ్యిలో పడటమంటే ఇదే మరి.! చంద్రబాబు హయాంలో ఆంధ్రప్రదేశ్‌ – తెలంగాణ మధ్య నీటి వివాదాలొచ్చాయి. ఇప్పటికీ ఆ వివాదాలు సద్దుమణగలేదు. నీళ్ళ వివాదాల సంగతి పక్కన పెడితే, గడచిన ఏడు నెలలుగా తెలంగాణ – ఆంధ్రప్రదేశ్‌ మధ్య ‘ఆర్టీసీ’ పరంగా రవాణా బంద్‌ అయ్యింది. కరోనా నేపథ్యంలో వచ్చిన లాక్‌డౌన్‌ తాలూకు ‘సెగ’ ఇంకా చల్లారలేదు. లాక్‌డౌన్‌ ముగిసిందిగానీ, ఇరు రాష్ట్రాల మధ్యా ఆర్టీసీ బస్సులు తిరగని పరిస్థితి. ‘చంద్రబాబులా కాదు.. మేం, పొరుగు రాష్ట్రాలతో సఖ్యత పాటిస్తాం.. ఇచ్చి పుచ్చుకునే ధోరణి ప్రదర్శిస్తాం..’ అంటూ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చాలా సందర్భాల్లో గొప్పలు చెప్పారు. కానీ, ఏదీ.. ఎక్కడ ఆ సఖ్యత.? ఆర్టీసీ అధికారులు మధ్య చర్చలైతే జరుగుతున్నాయిగానీ.. అవి అర్థం పర్థం లేని చర్చలుగానే మిగిలిపోతున్నాయి.

తెలంగాణ సరిహద్దు వరకూ బస్సులు నడుపుతామనీ, అక్కడి వరకు తెలంగాణ ఆర్టీసీ కూడీ బస్సులు నడపాలనే దీనస్థితికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దిగజారిపోయింది. తెలంగాణ నుంచి మాత్రం సానుకూల స్పందన రావడంలేదు. సందట్లో సడేమియా.. అన్నట్టుగా ప్రైవేటు ట్రావెల్స్‌, సామాన్యుల్ని నిలువునా దోచేస్తున్నాయి. ఎన్నాళ్ళిలా.? అంటే, ఈ ప్రశ్నకు సమాధానం దొరకని పరిస్థితి. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌, హైద్రాబాద్‌కి వచ్చి తెలంగాణ ముఖ్యమంత్రితో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించేందుకు అవకాశం వుంది. కానీ, ఆ ప్రయత్నం ముఖ్యమంత్రి స్థాయిలో జరగకపోవడమే ఈ గందరగోళానికి కారణమన్న విమర్శలున్నాయి.

‘మేం ఆంధ్రప్రదేశ్‌ని ఉద్ధరించేస్తున్నాం..’ అని చెప్పుకుంటే సరిపోదు, ఆర్టీసీ బస్సుల్ని పొరుగు రాష్ట్రం తెలంగాణకు నడపలేని అసమర్థతను ప్రజలు గుర్తిస్తున్నారు. ప్రైవేటు ట్రావెల్స్‌ దోపిడీకి పాల్పడుతోంటే, ప్రభుత్వం చోద్యం చూస్తోందంటూ జనం వాపోతున్నారు. ‘ఈ విషయంలో చంద్రబాబే నయ్యం..’ అనే పరిస్థితిని తీసుకొచ్చింది స్వయానా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వమే.

Exit mobile version