ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

దళిత రాజకీయం: బాధ్యులెవరు.? బాధితులెవరు.?

ఆంధ్రప్రదేశ్‌లో దళిత రాజకీయం నడుస్తోంది. అంటే, దళితుల్ని ఉద్ధరించే రాజకీయం కాదు. దళితుల్ని బలిపశువులగా మార్చే రాజకీయం. రాజధాని అమరావతికి సంబంధించి నడుస్తున్న వివాదంలోకి ‘దళిత రాజకీయం’ చొరబడింది. రాజధాని అమరావతి కోసం 300 రోజులకు పైగా ఉద్యమిస్తోన్న రైతులకు వ్యతిరేకంగా కొందరు రంగంలోకి దిగారు. మూడు రాజధానులే ముద్దు.. అంటూ నినదించారు. ‘భూములు ఇచ్చింది మేము.. నష్టపోతున్నది మేము.. మా గోడు మేం వెల్లగక్కుకుంటోంటే, మీరు మా మీద యుద్ధానికి వస్తారా.?’ అంటూ ‘మూడు రాజధానుల బ్యాచ్‌’ని అమరావతి రైతులు నిలదీశారు.

అంతే, ‘మూడు రాజధానుల బ్యాచ్‌’కి చెందిన కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు.. కొందరు అమరావతి రైతులు జైలుకు వెళ్ళారు. ఇక్కడ ఎస్సీ ఎస్టీలపైనే అట్రాసిటీ కేసులు నమోదవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోపక్క, రైతులకు సంకెళ్ళు వేసిన ఉదంతంపై మరింత దుమారం రేగుతోంది. దళిత రైతుల్ని, మూడు రాజధానులంటూ వచ్చిన దళితులే రెచ్చగొట్టారు.. ఈ ఘటనలో బాధితులంతా దళితులే.. బాధ్యులు కూడా దళితులే.. మళ్ళీ ఆ దళితుల కోసం దళితులే పోరాటాలు చేయాల్సి వస్తోంది. ఇదీ రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ చిత్రం. అధికార పార్టీకి చెందిన దళిత నేతలు పెదవి విప్పడంలేదు.. నిజానికి, ఈ పైత్యం అన్ని కులాల్లోనూ కనిపిస్తోంది. కమ్మ రాజకీయ నాయకుడ్ని తిట్టాలంటే, మళ్ళీ కమ్మ రాజకీయ నాయకుడ్నే ఇంకో పార్టీ వినియోగించాలి.

కాపు – కాపు, రెడ్డి – రెడ్డి.. ఇదీ వ్యవహారం. కులాల్ని చీల్చే రాజకీయం రాష్ట్రంలో నడుస్తోంది. ప్రధాన రాజకీయ పార్టీలు చేస్తున్న ఈ కుల రాజకీయాల్ని, కుల మతాలకతీతంగా ప్రతి ఒక్కరూ ఖండించకపోతే.. భవిష్యత్తు మరింత భయానకంగా తయారవుతుందన్నది నిస్సందేహం. ఓ దళిత ఎంపీ, దళితుడినైన తన మీద దాడి చేశారంటూ ఓ వ్యక్తి పోలీసులను ఆశ్రయిస్తే.. ఆ వ్యక్తికి ఇంతవరకు న్యాయం చేయలేదు. కారణం, సదరు దళిత ఎంపీ అధికార పార్టీకి చెందిన వ్యక్తి. రాష్ట్రంలో దళిత రాజకీయాలు ఎలా వున్నాయో చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.?

Exit mobile version