ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

బయటి కత్తిగాట్లు ఎవరివి జగన్ సారూ..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆదివారం సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. బయటివారి కత్తిగాట్లు, సొంతవారి వెన్నుపోట్లతో దగాపడ్డామని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. కులాల కలుపు మొక్కలు రాష్ట్ర పరువు తీస్తున్నాయని, వ్యవస్థలను వ్యక్తులు మేనేజ్ చేస్తున్న విధానం రాష్ట్రాన్ని దెబ్బ తీస్తోందని వాపోయారు. ప్రస్తుతం దీనిపై సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతోంది.

ఇక్కడ బయటివారి కత్తిగాట్లు అని ఎవరిని ఉధ్దేశించి జగన్ మాట్లాడారు అనేదానిపై జోరుగా చర్చ సాగుతోంది. రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ నేతలనా లేక ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా, పోలవరం నిధులివ్వకుండా కొర్రీలు పెడుతున్న బీజేపీ పెద్దలను ఉద్దేశించి ఆయన ఇలా అన్నారా అంటూ విశ్లేషణలు చేస్తున్నారు.

అవతరణ దినోత్సవ ప్రసంగంలో భాగంగా జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రం పడుతున్న కష్టాలను ఏకరువు పెట్టారు. ఏ రాష్ట్రమూ కూడా పడనంతగా దగా పడిన రాష్ట్రమే మనదేనన్న సంగతి గుర్తుంచుకోవాలన్నారు. బయటివారి కత్తిగాట్లు, సొంతవారి వెన్నుపోట్లతో తల్లడిల్లిన రాష్ట్రం మనదని పేర్కొన్నారు. ఇలాంటి ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లడానికి కృషి చేస్తున్నట్టు చెప్పారు.

దేవతలు చేసే యజ్ఞానికే రాక్షసుల పీడలు తప్పనప్పుడు.. ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న తమ ప్రభుత్వానికి ఆటంకాలు ఎదురు కాకుండా ఉంటాయా అని ప్రశ్నించారు. తెలుగు నేలపై పుట్టిన కలుపు మొక్కలు మన పరువు ప్రతిష్టలను బజారుకు ఈడుస్తున్నాయని.. వీటిని ఇలాగే వదిలేయాలా అనే విషయాన్ని ఆలోచించాలన్నారు.

ప్రజల తీర్పును, ప్రభుత్వ నిర్ణయాలను అడ్డుకుంటూ వ్యక్తులు చేస్తున్న వ్యవస్థల మేనేజ్ మెంట్ మొత్తంగా తెలుగుజాతి ప్రయోజనాలకు వేరుపురుగుగా మారిందని, దీనిని ఇలాగే కొనసాగిద్దామా అనేదానిని కూడా ఆలోచించాలని పేర్కొన్నారు. తనవాడు గెలవలేదు, తమవాడు అధికారంలో లేడన్న కడుపు మంటతో నిత్యం అసత్యలు ప్రసారం చేయడమే పనిగా పెట్టుకున్న టీవీలు, పేపర్ల వ్యవహారాన్ని సమాచార వ్యవస్థ అందామా అని ప్రశ్నించారు.

మొత్తానికి అవతరణ దినోత్సవం నాడు జగన్ తన మనసులో ఉన్న బాధనంతా వెళ్లగక్కారని అంటున్నారు. ఇప్పటికే ఏపీకి ప్రత్యేక హోదాను అటకెక్కించిన కేంద్ర ప్రభుత్వం.. తాజాగా పోలవరం నిధుల విషయంలోనూ మొండిచేయి చూపిస్తోంది. వీటిపై కేంద్రాన్ని గట్టిగా నిలదీయలేని పరిస్థితిలో ఉండటం వల్లే జగన్ ప్రసంగం అలా సాగిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. నేరుగా కేంద్రంతో ఢీకొట్టే పరిస్థితి లేకపోవడం వల్లే అలా బయటివారి కత్తిగాట్లు అని వ్యాఖ్యానించి ఉంటారని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Exit mobile version