తమ పనులు చక్కబెట్టుకోవడానికి వీలు కాకపోవడంతో ఆయా ప్రజా ప్రతినిథులు సదరు సీనియర్ అధికారిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వద్ద తమ గోడు వెల్లగక్కుకున్నారట. సహచర ఐఏఎస్ అధికారులు కూడా ఆయన తీరుపట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారట. అన్నిటికీ మించి, సీనియర్ ఐఏఎస్ అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యంపై ‘వేటు’ పడటానికి కారణం కూడా సదరు సీనియర్ ఐఏఎస్ అధికారేనట. ఆయన ఎవరూ కాదు, ప్రవీణ్ ప్రకాష్ అట. ఇదంతా వైసీపీ అనుకూల మీడియాలో జరుగుతున్న ప్రచారం.
తనకు వ్యతిరేకంగా జరుగుతున్న ‘కథ’పై ఉప్పందడంతో సదరు సీనియర్ అధికారి, వేటు పడక ముందే తేరుకోవాలన్న కోణంలో, తనను కేంద్ర సర్వీసులకు బదిలీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ని కోరారట. అలా కోరిందే తడవు, ప్రవీణ్ ప్రకాష్ బదిలీకి సానుకూలత తెలిపారట ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఇదంతా వైసీపీ అనుకూల మీడియాలో జరుగుతున్న ప్రచారం తాలూకు సారాంశం.
గతంలో టీడీపీ అనుకూల మీడియా ఈ తరహా కథనాల్ని తెరపైకి తెచ్చేది. ఆ మాటకొస్తే, టీడీపీ హయాంలో.. ఈ తరహా రాజకీయం కొత్తేమీ కాదు. అచ్చంగా, అదే బాటలో వైసీపీ కూడా నడుస్తున్నట్లుంది. ఎవరికి పొగ పెట్టాలో వారిపై, తమ అను‘కుల’ మీడియాతో ప్రచారం చేయించి, ‘ఇలా అనుకుంటున్నారు.. అలా అనుకుంటున్నారు..’ అని చెప్పించి, బురద చల్లేసి.. సాగనంపేయడం ఈ ‘కుల’ మీడియాకి అలవాటుగా మారిపోయింది.
మరి, సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ విషయంలో వైసీపీ అనకూల మీడియా ప్రచారం నిజమేనా.? పేరు పెట్టి మరీ తన మీద దుష్ప్రచారం షురూ చేసిన సదరు వైసీపీ అను‘కుల’ మీడియాపై సదరు సీనియర్ ఐఏఎస్ అధికారి ఎలాంటి చర్యలు తీసుకుంటారు.? ఏమో, వేచి చూడాల్సిందే.