ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

జస్ట్‌ ఆస్కింగ్‌: ఏపీలో వర్షం వైసీపీ పక్షమా.?

‘వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక.. ఆంధ్రప్రదేశ్‌లో నీళ్ళకి కరువు లేదు.. ఎడా పెడా వర్షాలు కురిసేస్తున్నాయ్‌.. ప్రాజెక్టులూ నిండిపోతున్నాయ్‌. ఇదంతా వైఎస్‌ జగన్‌ గోల్డెన్‌ లెగ్‌ మహిమ..’ అని చెబుతూ, ‘చంద్రబాబుది ఐరన్‌ లెగ్‌.. ఆయన పాలన అంతా కరవు కాటకాలే..’ అంటూ వైసీపీ నేతలు, ఆ పార్టీకి చెందిన నెటిజన్లు హోరెత్తించేస్తూ వచ్చారు నిన్న మొన్నటిదాకా. ఇటు మెయిన్‌ స్ట్రీమ్‌ మీడియా ముందూ, అటు సోషల్‌ మీడియాలోనూ ఇదే రచ్చ. మరి, ఆంధ్రప్రదేశ్‌ని వెంటాడుతున్న వరదల మాటేమిటి.? అంటూ తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు, మద్దతుదారులు ఎదురుదాడికి దిగుతున్నారు.

వైసీపీ, టీడీపీ మధ్య ‘వర్షం ఎవరి పక్షం’ అనే అంశానికి సంబంధించి జరుగుతున్న రాజకీయ రచ్చ విషయమై జనసేన పార్టీకి చెందిన ఓ నేత సోషల్‌ మీడియా వేదికగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అటు వైసీపీ చెప్పిందీ నిజమే.. ఇటు టీడీపీ చెబుతున్నదీ నిజమే.. వైసీపీ చెబుతున్నట్లు, చంద్రబాబు పాలనలో కరువు కాటకాలు చూశాం.. చంద్రబాబు పాలనలో వరదలు చూస్తున్నాం.. అన్నది జదరు జనసేన నేత అభిప్రాయం. సోషల్‌ మీడియాలో జరుగుతున్న ‘వైసీపీ వర్సెస్‌ టీడీపీ’ గొడవపై జనసేన నేతలనే కాదు, సాధారణ ప్రజానీకానిదీ ఇదే వాదన. చంద్రబాబు హయాంలో వరదలొచ్చినా, తుపాన్లు వచ్చినా.. అదో పబ్లిసిటీ స్టంట్‌. చంద్రబాబు పేరు మార్మోగిపోయేలా కార్యక్రమాలుండేవి. ఇప్పుడు వైఎస్‌ జగన్‌ చుట్టూ అలాంటి హంగామా నడుస్తోంది.

చిత్తూరు జిల్లాలో వరదల మధ్య కొందరు వ్యక్తులు ఇరుక్కుపోతే, వారిని ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది ప్రాణాలకు తెగించి కాపాడారు. అక్కడికేదో, తానే ఏట్లోకి దూకేసి.. అందర్నీ రక్షించేసినట్లు, వైసీపీ ఎమ్మెల్యే ఒకరు.. బాధితులకు యాపిల్‌ పండ్లు అందించి, నీళ్ళ సీసా ఇచ్చారు. మళ్ళీ ఫొటోలకు పోజులొకటి. వర్షం జగనన్న దయ.. అన్నప్పుడు, వరద కూడా జగనన్న ఎఫెక్టే కదా.! ఆ లెక్కన, తుపాన్ల దెబ్బకి జనం ప్రాణాలు కోల్పోతోంటే, అది వైసీపీ పాలన గొప్పతనంగా ఎందుకు చెప్పుకోకూడదు.? తుపాన్లు, వరదలు అనేవి విపత్తులు.. వాటి చుట్టూ పొలిటికల్‌ స్టంట్లు రాజకీయ పార్టీలు చేస్తోంటే, నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి ప్రజలది.

Exit mobile version