ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

జస్ట్ ఆస్కింగ్: షర్మిల, ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించరేం.?

తెలంగాణలో నిన్న మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ జరిగింది. ఓ ప్రైవేటు ఆసుపత్రి ఈ డ్రైవ్ నిర్వహిస్తే, తెలంగాణ పోలీస్ విభాగం సంపూర్ణ సహాయ సహకారాలు అందించింది. వ్యాక్సినేషన్ ఖరీదు.. ఒక్కో డోసుకీ 1400 రూపాయలు. 40 వేల మందికి పైగా ప్రజలు ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్‌కి హాజరై, వ్యాక్సిన్లను వేయించుకున్నారు.

ఈ వ్యవహారంపై వైఎస్ షర్మిల ఘాటైన ట్వీటేశారు. వ్యాక్సిన్లు ప్రైవేటు బాట పడుతున్నాయనీ, ప్రభుత్వం మాత్రం వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఫెయిల్ అయ్యిందనీ షర్మిల, కేసీఆర్ సర్కారుపై గుస్సా అయ్యారు. నిజానికి, ఈ విషయంలో షర్మిల ప్రశ్నించాల్సింది ప్రధాని నరేంద్ర మోడీని, కేంద్ర ప్రభుత్వాన్ని. కేంద్రమే వ్యాక్సిన్లను ప్రైవేటు ఆసుపత్రులు కూడా వేయొచ్చని తన మార్గదర్శకాల్లో పేర్కొంది. ప్రైవేటుగా వేసే వ్యాక్సిన్ ధరని వ్యాక్సిన్ తయారీ సంస్థలు తమ సొంతంగా నిర్ణయించుకోవచ్చనీ వెసులుబాటు కల్పించింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో చేయడానికేమీ లేదు.. కేంద్రాన్ని నిలదీయడం తప్ప.

దేశంలోని చాలా రాష్ట్రాలు ఈ విషయమై ఇప్పటికే కేంద్రాన్ని ప్రశ్నించాయి, ప్రశ్నిస్తూనే వున్నాయి. మొత్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను కేంద్రమే, దేశవ్యాప్తంగా ఉచితంగా చేపట్టాలన్నది అన్ని రాష్ట్రాల డిమాండ్. ఇక, ప్రైవేటు ఆసుపత్రుల్లో వ్యాక్సినేషన్ అన్నది తెలంగాణకే పరిమితం కాలేదు.. ఆంధ్రపదేశ్ రాష్ట్రంలోనూ ఈ దందా నడుస్తోంది. దందా.. అని ఎందుకు అనాల్సి వస్తోందంటే, ప్రైవేటు ఆసుపత్రుల్లో అడ్డగోలుగా వ్యాక్సిన్ ధరలు వుంటున్నాయని సాక్షాత్తూ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సెలవిచ్చారు. అంటే, ప్రైవేటు ఆసుపత్రుల్ని అదుపులో పెట్టలేని అసమర్థ పాలన ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో వుందనే కదా అర్థం.? అన్న విమర్శల సంగతి పక్కన పెడదాం.

తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ పెట్టాలనుకుంటున్న షర్మిల, తెలంగాణా ప్రజల తరఫున తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలనుకుంటే.. ఆ ఆలోచనని తప్పు పట్టలేం. కానీ, 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున ఏపీలో ప్రచారం చేశారు గనుక, ఆంధ్రపదేశ్ ప్రజల తరఫున కూడా ఆమె నిలబడాలి. కానీ, అక్కడ వున్నది అన్న వైఎస్ జగన్. అందుకే, అక్కడి సమస్యలపై షర్మిల నోరు పెగలదు. దీన్ని ఏ కోణంలో నైతికత అనాలో ఏమో.?

Exit mobile version