ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

తెలంగాణలో షర్మిల రాజకీయం.. ఏపీ సీఎం జగన్‌పై ఏ తరహా యుద్ధం.?

జులై 8వ తేదీన వైఎస్ షర్మిల కొత్త రాజకీయ పార్టీ ప్రకటించనున్న విషయం విదితమే. అదే రోజు, స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఇడుపులపాయలోని సమాధి వద్ద నివాళులర్పించనున్నారు షర్మిల. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా అదే రోజు తన తండ్రి సమాధి వద్ద నివాళులర్పిస్తారు. అయితే, ఇందుకోసం వేర్వేరు సమయాల్ని ఇద్దరూ ఎంచుకున్నారా.? ఒకే సమయంలో అన్నా, చెల్లెలు తమ తండ్రి సమాధి వద్ద నివాళులర్పిస్తారా.? అన్నదానిపై భిన్న వాదనలున్నాయి.

రాజకీయంగా ఏమనుకున్నా, తెరవెనుకాల కుటుంబ వ్యవహారాల పరంగా ఇద్దరి మధ్యా విభేదాలుంటాయని ఎవరూ అనుకోవడానికి వీల్లేదు. అసలంటూ వైఎస్ జగన్ సూచన అత్యంత వ్యూహాత్మకంగా తెలంగాణలో షర్మిలతో పార్టీ పెట్టిస్తున్నారనీ, అందుకు అనుగుణంగానే ఆయన తన పార్టీ వైఎస్సార్సీపీని తెలంగాణలో లేకుండా చేశారన్న వాదనలు లేకపోలేదు.

గతంలో వైసీపీ తరఫున తెలంగాణలో పని చేసిన నాయకులే, ఇప్పుడు షర్మిల వెంట వున్నారు. సరే, తెలంగాణ కోసం అవసరమైతే అన్న వైఎస్ జగన్‌తో రాజకీయ యుద్ధం చేయడానికీ సిద్ధమేనని షర్మిల చెబుతున్న మాటల్లో చిత్తశుద్ధి ఎంత.? అన్నది వేరే చర్చ. కానీ, ఇప్పుడో అనుకోని సమస్య వచ్చిపడింది తెలుగు రాష్ట్రాల మధ్య. ఏపీ ప్రాజెక్టులు అక్రమం అని తెలంగాణ అంటోంది.. తెలంగాణ ప్రాజెక్టులు అక్రమం అని ఏపీ అంటోంది. ఈ వ్యవహారంలో షర్మిల వాదన ఎలా వుండబోతోంది.?

పోతిరెడ్డిపాడు వైఎస్సార్ హయాంలో పాపులర్ అయ్యింది. పులిచింత వ్యవహారంతోనూ వైఎస్సార్‌కి సంబంధం వుంది. ఈ రెండు విషయాల్లోనూ వివాదాలు తలెత్తుతున్నాయి. వైఎస్సార్ చేసింది రైటే అయితే, ఏపీ తరఫున షర్మిల మాట్లాడాలి. తెలంగాణ వాదనకు షర్మిల మద్దతిస్తే, వైఎస్సార్ తప్పు చేసినట్లు ఆమె ఒప్పుకున్నట్లవుతుంది. మరి, ఈ సమస్య నుంచి షర్మిల ఎలా బయటపడతారు.? బయటపడి సమర్థవంతమైన రాజకీయాన్ని తెలంగాణలో ఎలా చెయ్యగలుగుతారు.? ఒకటా.? రెండా.? తెలంగాణ – ఆంధ్రపదేశ్ మధ్య వెతికితే బోల్డన్ని సమస్యలు కనిపిస్తాయి తెలంగాణ వాదులకి.

ముఖ్యంగా కేసీయార్, ఇలాంటివాటిని వెతికి రచ్చ చేయడంలో దిట్ట. కేసీయార్ వ్యూహాల నుంచి తప్పించుకోవడం షర్మిలకు అంత తేలిక కాదు. అయితే, కేసీయార్ – వైఎస్ జగన్ కలిసి ఆడుతున్న డ్రామాగా ప్రస్తుతం కృష్ణా జలాల వివాదాన్ని అభివర్ణిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. అదే నిజమైతే, షర్మిలకు కేసీయార్ తెరవెనుకాల రెడ్ కార్పెట్ వేసినా ఆశ్చర్యపోవాల్సిన పని వుండదేమో.

Exit mobile version