అప్పులు చేస్తే తప్ప ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దుస్థితి తెలంగాణలో కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వుంది. అప్పు చేస్తేనేగానీ, సంక్షేమ పథకాలు అమలు చేయలేని దుస్థితి తెలంగాణలో కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే వుంది. అసలు అప్పు చేయకపోతే నెల గడవని తుస్థితి తెలంగాణలో కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే వుంది.
2019 సంవత్సరంలో నిరుద్యోగుల ఆత్మహత్యల లెక్క చూస్తే, ఆంధ్రప్రదేశ్ వాటా 71. తెలంగాణలో ఈ సంఖ్య 56. తెలంగాణలో నిరుద్యోగుల ఆత్మత్యలంటూ షర్మిల గత కొద్ది రోజులుగా మంగళవారం దీక్షలు చేస్తోన్న విషయం విదితమే. నిజానికి, ఆమె అలాంటి నిరసన దీక్షలు చేపట్టాల్సింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. కానీ, ఆమెకు అంత ధైర్యమెక్కడిది. అన్న వైఎస్ జగన్ స్పాన్సర్‌షిప్‌తో తెలంగాణలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ పెట్టిన షర్మిల, ఏపీలో అన్న జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తారా.? ఛాన్సే లేదు.
‘నేనెవరో వదిలిన బాణాన్ని కాదు..’ అని షర్మిల చెప్పకుంటారుగానీ, ఆమె నిఖార్సయిన బాణం.. అదీ అన్న జగన్ వదిలిన బాణం. లేకపోతే, షర్మిల ఏనాడో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలెదుర్కొంటున్న సమస్యలపై పోరాడేవారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పులివెందులలోగల వైఎస్సార్ సమాధి వద్ద నివాళులర్పించి, తెలంగాణలో పార్టీ స్థాపించిన షర్మిల, వైఎస్సార్ ఎంతగానో అభిమానించే ఆంధ్రప్రదేశ్ మీద కనీసపాటి బాధ్యత చూపకపోవడం బాధాకరం.
పోలవరం ప్రాజెక్టు.. వైఎస్సార్ కల. ఆ ప్రాజెక్టు చుట్టూ జరుగుతున్న రాజకీయ రచ్చ పైన అయినా షర్మిల మాట్లాడాలి కదా.? పైగా, 2019 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున వకాల్తా పుచ్చుకుని, రాష్ట్రమంతటా పర్యటించి, ఆ పార్టీకి ఓట్లెయ్యాలని కోరారామె.