విశాల్ హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం ‘తుప్పరివాలన్ 2’. గతంలో వచ్చిన తుప్పరివాలన్ సినిమాకు ఇది సీక్వెల్ అనే విషయం తెల్సిందే. మొదటి పార్ట్ మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో రెండవ పార్ట్‌పై అంచనాలు భారీగానే ఉన్నాయి. షూటింగ్ ప్రారంభం సమయంలోనే సినిమాపై ఆసక్తి పెరిగింది. అయితే షూటింగ్ మద్యలో దర్శకుడు మిస్కిన్ తప్పుకున్నాడు. ఆ విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మిస్కిన్ తప్పుకోవడంతో ఆ బాధ్యతను కూడా విశాల్ నెత్తిన వేసుకున్నాడు.
తుప్పరివాలన్ మొదటి పార్ట్‌ను మంచి సినిమాగా తెరకెక్కించిన దర్శకుడు రెండవ పార్ట్‌కు కూడా న్యాయం చేస్తాడని అంతా అనుకుంటే ఆయన కాస్త మద్యలోనే వెళ్లి పోయాడు. తుప్పరివాలన్ సినిమా సీక్వెల్‌కు మిస్కిన్ దర్శకత్వం వహించడం లేదని తాజాగా క్లారిటీ వచ్చేసింది. సగంలో వదిలేసిన సినిమాను తాను పూర్తి చేస్తున్నట్లుగా విశాల్ అధికారికంగా ప్రకటించాడు. సినిమా షూటింగ్ సమయంలో ఎదురైన సంఘటన గురించి విశాల్ ట్విట్టర్లో సుదీర్ఘమైన ఒక లేఖను ఉంచాడు.
ఆ లేఖలో దర్శకుడు మిస్కిన్ పై విమర్శలు గుప్పించాడు. అదే సమయంలో ఒక దర్శకుడిని బతిమిలాడి సినిమా చేయించుకోవలా అంటూ ప్రశ్నించాడు. కోట్లు పెట్టే నిర్మాతలు దర్శకుడి వెంట బడి ఆయన్ను బతిమిలాడుతూ సినిమా చేయించుకోవాల్సిన అవసరం ఏంటీ అన్నాడు. ఈ విషయాన్ని తాను కొత్తగా నిర్మాణంలోకి రాబోతున్న నిర్మాతలకు చెబుతున్నాను. దర్శకులను బతిమిలాడి చేయించుకోవాల్సిన అవసరం లేదు. వారి బాధ్యత ప్రకారం సినిమా చేయకపోతే అప్పుడు చర్యలు తీసుకోవాల్సిందే అని ఆయన అన్నాడు.