ఫైర్ బ్రాండ్ క్వీన్ కంగన పరిచయం అవసరం లేదు. ఎదుట ఉన్నది ఎంతటివారైనా కంగన భయపడక ఎదురిస్తుంది. ఘాటైన కామెంట్లతో విరుచుకుపడుతుంది. బాలీవుడ్ లో చాలా మంది ప్రముఖులతో పాటు శివసేన నాయకులు కూడా క్వీన్ బాధితులు. ఇప్పుడు పాపులర్ దర్శకుడి భార్యపై తుపాకి గుళ్లు కురిపించింది. వివరాల్లోకి వెళితే…
ఇటీవలే ప్రముఖ దర్శకనిర్మాత విధు వినోద్ చోప్రా ట్వల్త్ ఫెయిల్ చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టిన సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి ప్రశంసలు పొందిన ఈ చిత్రం ఆస్కార్ రేసులోకి కూడా వెళుతోంది. ఈ సినిమాపై చాలా మంది సినీప్రముఖులు ప్రశంసలు కురిపించారు. అయితే ఈ సినిమాని థియేటర్లలో కాకుండా ఓటీటీలో రిలీజ్ చేయాల్సిందిగా విధు వినోద్ చోప్రా భార్య, ప్రముఖ జర్నలిస్ట్ అనుపమ చోప్రా సూచించారట. ఈ విషయం తెలిసాక క్వీన్ కంగన సదరు దర్శకుడి భార్యామణిపై విరుచుకుపడింది.
కంగనా ఎక్స్ ఖాతాలో ఒక ట్వీట్‌లో “విధు సర్ భార్య అనుపమ చోప్రా సినిమా జర్నలిజం రంగానికి అప్రతిష్ట. ఆమె జెనోఫోబియాను ప్రదర్శించడమే కాకుండా యువ, తెలివైన మహిళలపై తీవ్ర అసూయను చూపుతూ అభద్రతను కలిగి ఉంటుంది. ఆమె తన స్వంత భర్తను చూసి అసూయపడటంలో ఆశ్చర్యం లేదు. తన వెబ్‌సైట్ అలాగే ఇతర వెంచర్‌లను స్థాపించడానికి అతడి (విధు) పేరును, సంపదను ఉపయోగించుకుంటుంది. అసలైన ప్రతిభకు, మంచి చిత్రాలకు వ్యతిరేకంగా బాలీవుడ్‌లోని గాసిప్ సర్కిల్స్‌తో కలిసి పని చేస్తోంది. తనను తాను సరిదిద్దుకోవడానికి అనుపమ తన ‘బాలీవుడ్ వైఫ్ కార్డ్’ని ఫిల్మీ సమావేశాలలో ప్రదర్శిస్తుంది” అని ఘాటైన వ్యాఖ్యలు చేసింది.
ఇటీవలి బ్లాక్‌బస్టర్- ట్వల్త్ ఫెయిల్‌ను థియేటర్లలో కాకుండా నేరుగా OTTలో విడుదల చేయాలని అనుపమ సూచించారు. దీనిపై కంగన తీవ్రంగా విరుచుకుపడింది. కంగనా వ్యాఖ్యలు ఆన్‌లైన్ చర్చలకు దారితీశాయి. డిజాస్టర్ తేజస్‌లో చివరిసారిగా కనిపించిన కంగనా రనౌత్ ఇప్పుడు తన తదుపరి దర్శకత్వ వెంచర్ ‘ఎమర్జెన్సీ’ విడుదల కోసం వేచి చూస్తోంది. ఇంతలో తన సొంత వెబ్‌సైట్‌తో దర్శకుడు విధు వినోద్ చోప్రా భార్య, ప్రముఖ సినీ జర్నలిస్ట్ అనుపమ చోప్రా వ్యాఖ్యలను కంగన తిప్పి కొట్టింది. అనుపమ్ చోప్రా తేజస్ సహా కంగన నటించిన చాలా సినిమాలపై ప్రతికూల సమీక్షలు రాసారు.