మెగాస్టార్ చిరంజీవి నటవారసుడిగా సినీరంగ ప్రవేశం చేసాడు రామ్‌చరణ్. `చిరుత` చిత్రంతో కెరీర్ ప్రారంభించిన చరణ్ ఆ తర్వాత మగధీరతో భారీ పాన్ ఇండియా విజయం అందుకున్నాడు. కానీ ఆ తర్వాత కెరీర్ అంత సులువుగా సాగలేదు. అతడి ఎంపికలు అన్నీ కమర్షియల్ పంథాలో ఉన్నాయని, రొటీన్ కథలు, పాత్రల్లో నటిస్తున్నాడని విమర్శలొచ్చాయి. చరణ్ నటన గురించి ఒక సెక్షన్ నెగెటివ్ గానే స్పందించింది. దాదాపు ఏడెనిమిది సినిమాలు చేసిన తర్వాత కూడా ఈ నెగెటివిటీనే స్ప్రెడ్ అవుతూనే ఉంది. కానీ అనూహ్యంగా చరణ్ ధృవ (తని ఒరువన్ రీమేక్), రంగస్థలం చిత్రాలతో కథ మార్చిన పురుషుడయ్యాడు. నిజం చెప్పాలంటే ఆ రెండు సినిమాలు చరణ్ కి రియల్ గేమ్ ఛేంజర్స్. ముఖ్యంగా రంగస్థలం చిత్రంలో సిట్టిబాబు పాత్రలో అతడి నటన మాస్ క్లాస్ అనే తేడా లేకుండా అందరినీ మైమరిపించింది. నిజమైన గోదారి పరిసరాల్లోని పల్లెటూరి కుర్రాడినే తలపించాడు. అంతగా ఒదిగిపోయి పాత్రకు ప్రాణం పోసాడు చరణ్. దీంతో అతడిలోని విలక్షణ నటుడు బయటికి వచ్చాడు.
అయితే అప్పట్లోనే రామ్ చరణ్ బాలీవుడ్ లోను ఎంట్రీ ఇచ్చాడు. బిగ్ బి అమితాబ్ బచ్చన్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ జంజీర్ రీమేక్ లో నటించాడు. తూఫాన్ టైటిల్ తో ఈ సినిమా హిందీ-తెలుగులో రిలీజైంది. ఈ చిత్రానికి అపూర్వ లఖియా దర్శకత్వం వహించారు. కానీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టరైంది. అదే సమయంలో స్థానిక మీడియాలు సహా బొంబాయి మీడియా నెగెటివ్ కథనాలు వెలువరించింది. చరణ్ నటనను కూడా విమర్శించింది.
తాజాగా నాటి విషయాన్ని స్ఫురణకు తెచ్చుకుని మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే ఈవెంట్లో బాబి చేసిన ఓ వ్యాఖ్య హాట్ టాపిక్ గా మారింది. రామ్ చరణ్ తండ్రికి తగ్గ తనయుడిగా చేతలతోనే తానేంటో చూపించాడు. ఎంతో ఒదిగి ఉంటూనే తనపై ప్రచారమైన నెగెటివిటీకి ప్రాక్టికల్ గా చేతల్లోనే సమాధానమిచ్చాడని దర్శకుడు బాబి (కేఎస్ రవీంద్ర) వ్యాఖ్యానించారు. ఆ టైమ్ లో బాంబే మీడియాలోను నెగెటివ్ కథనాలొచ్చాయి. కానీ చరణ్ ఓపిగ్గా కొడ్తే గ్లోబ్ ఊగిపోయేలా కొట్టాడు! అంటూ ప్రశంసలు కురిపించారు. తనపై విమర్శలు వచ్చిన ప్రతిసారీ దానికి మంచి విజయంతో తన చేతలతో చరణ్ సమాధానమిచ్చాడని బాబి వ్యాఖ్యానించారు. నిదానంగా నెమ్మదిగా ఉంటూ చిరంజీవి గారు, బాబాయ్ పవన్ కల్యాణ్ గారిలాగా అభిమానులకు ఈ జనరేషన్ లో నేనున్నానంటూ భరోసానిస్తూనే ఉన్నాడు… అని బాబి అన్నారు.
రామ్ చరణ్ నటించిన ఆర్.ఆర్.ఆర్ గ్లోబల్ హిట్ చిత్రంగా నిలిచింది. రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రంలో చరణ్ నటన, డ్యాన్సులకు ప్రపంచస్థాయి ప్రశంసలు కురిసాయి. ప్రముఖ హాలీవుడ్ నటీనటులు సహా హాలీవుడ్ క్రిటిక్స్ నుంచి ప్రశంసలు దక్కాయి. చాలా మంది హాలీవుడ్ ప్రముఖులు చరణ్ తో కలిసి నటించాలనుందని వ్యాఖ్యానించారు. ఆస్కార్ అందుకున్న నాటు నాటు ఒరిజినల్ గీతంలో స్నేహితుడు తారక్ తో కలిసి చరణ్ చేసిన నృత్యాలు ఎప్పటికీ అభిమానులకు గుర్తిండిపోయాయి. అందుకే ఇప్పుడు బాబి అసలు ఆర్.ఆర్.ఆర్ ప్రస్థావన తేకుండానే నర్మగర్భంగా “చరణ్ కొడ్తే గ్లోబ్ కదిలిపోయింది!“ అని వ్యాఖ్యానించాడు. చరణ్ బర్త్ డే కార్యక్రమంలో భారీ అభిమానుల సమక్షంలో బాబి కూడా ఒక అభిమానిగా పైవిధంగా స్పందించాడు.