ఉన్నట్లుండి సోషల్ మీడియాలో ఓ పోస్ట్. బాలయ్య కరోనా వ్యవహారాల కోసం ఏకంగా కోటి రూపాయలు విరాళం ఇచ్చారన్నది విషయం. సినిమా ఇండస్ట్రీలో బడాబాబులు ఎవ్వరూ కరోనాకు సాయం అందించే విషయంలో ఇప్పటి వరకు నోరు విప్పడం లేదు. ఎంత సేపూ ట్వీట్ లు వేయడం, విడియోలు వేయడం తప్పించి, రూపాయి విదిల్చిన పాపాన పోలేదు.
చిరంజీవి కావచ్చు, మహేష్ బాబు కావచ్చు, ఎన్టీఆర్ కావచ్చు, ప్రభాస్ కావచ్చు. అందరూ అదేబాపతు. చేతులు కడుక్కోడి..మూతులు కడుక్కోండి..ఇంట్లో వుండండి అంటూ విడియోల మీద విడియోలు ట్విట్టర్ లో పడేయడం. దాన్ని ఆ హీరోల పీర్వోలు వాట్సాప్ ల్లో డంప్ చేయడం. ఇదే కార్యక్రమం.
నితిన్ బెటర్ కనీసం విరాళాలు ప్రకటించారు. కొంత అందించారు. వినాయక్, శివాజీరాజా లాంటి వాళ్లు కనీసం వాళ్ల వాళ్ల స్థాయిల్లో ఏదో ప్రయత్నం చేసారు. వీరందరికన్నా రాజశేఖర్ మందుకు వచ్చారు. నేను ట్విట్టర్ లో, ఇన్ స్టాలోకి వచ్చానోచ్ అంటూ తెగ హడావుడి చేసిన మెగాస్టార్ చేసింది లేదు, ప్రకటించిందీ లేదు. పవన్ కళ్యాణ్ మాత్రం గురువారం ఉదయం రెండు రాష్ట్రాలకు చెరో యాభై లక్షలు ప్రకటించారు.
ఇలాంటి నేపథ్యంలో బాలయ్య కోటి విరాళం ఇచ్చారంటూ అక్కడ అక్కడ కొన్ని పోస్ట్ లు. ఇది నిజమేనా? అంటే అనుమానమే. ఎందుకంటే అసలు కరోనా మీద ఇప్పటి వరకు ఓ స్టేట్ మెంట్ కానీ, విడియో కానీ, విన్నపం కానీ ఏదీ చేయని హీరో ఎవరు అంటే బాలయ్యే అంటున్నారు అంతా. అలాంటిది ఏకంగా కోటి ఇచ్చారు అంటే నమ్మాలా? అని ప్రశ్నిస్తున్నారు.
అంతే కాదు, టాప్ హీరోలు సోషల్ మీడియాలో చేసే ప్రవచనాలు, విడియోలు తిరస్కరించాలని, కానీ ఖర్చులేకుండా వాళ్లు చెప్పే కబుర్లు, వాటిని ప్రచారం చేయడం వంటి వాటిని చూడనట్లుగా వదిలేయాలని, అప్పుడు ప్రజాభిమానాన్ని కోట్లకు కోట్లు కింద క్యాష్ చేసుకుంటూ, అవసరం అయినపుడు రూపాయి విదల్చని వారికి కనువిప్పు కలిగే అవకాశం వుందని కామెంట్ లు వినిపిస్తున్నాయి.