పీఆర్ విషయంలో టాలీవుడ్ హీరోల్లో అల్లు అర్జున్‌ను కొట్టేవాడు లేడన్నది ఇండస్ట్రీ వర్గాల అభిప్రాయం. సోషల్ మీడియా బన్నీ సినిమాల గురించి, అతడి ఇతర వ్యవహారాల గురించి జరిగే ప్రచారం చూస్తే ఈ అభిప్రాయం తప్పేమీ కాదనిపిస్తుంది.
ఎక్కుమందితో బలమైన పీఆర్ టీంను పెట్టుకుని.. వాళ్ల ద్వారా తన సినిమాలు, ఇతర వ్యవహారాల్ని మీడియాలోకి, జనాల్లోకి బలంగా తీసుకెళ్తుంటాడు. మిగతా స్టార్ హీరోలు కూడా బన్నీని అనుసరిస్తున్నారు కానీ.. అతడిలా సక్సెస్ మాత్రం కావడం లేదు.
ఇప్పుడీ ఉపోద్ఘాతమంతా ఎందుకు అంటే.. ఈ నెల 8వ తేదీన బన్నీ పుట్టిన రోజు నేపథ్యంలో తాజాగా అభిమానుల కోసం కామన్ డిస్ ప్లే పిక్ తయారు చేయించారు. అది చూశాక బన్నీ అండ్ కో ప్లానింగే వేరని అర్థమవుతోంది. ఇంతకుముందు ఇలాంటివి అభిమానులే తమకిష్టం వచ్చినట్లు రూపొందించుకునేవాళ్లు. కానీ ఈ మధ్య హీరోల వారి పీఆర్ టీంలే వీటి మీద దృష్టిపెడుతున్నాయి. ఒక టీంను ఏర్పాటు చేసి వాళ్లతో సీడీపీలు తయారు చేయిస్తున్నాయి. అవి ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటున్నాయి.
బన్నీ బర్త్ డే సీడీపీ చూస్తే ఇలాంటిది నెవర్ బిఫోర్ అని చెప్పొచ్చు. బన్నీ సినిమాలన్నింటిలో లుక్స్ అన్నీ సీడీపీలో పేర్చడం మామూలు విషయమే. దీనికి తోడు అతను పని చేసిన దర్శకుల ఫొటోలున్నాయి. ఇంకా అతడి సేవా కార్యక్రమాలకు సంబంధించిన చిత్రాలు పొందుపరిచారు. అంతే కాక దేశంలోని 13 భాషల్లో బన్నీకి పుట్టిన రోజు శుభాకాంక్షలూ చెప్పారు. దీన్ని బట్టి సీడీపీ విషయంలో ఎంత ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ ఉందన్నది అర్థం చేసుకోవచ్చు.