పెట్టుబడి-రాబడి కోణంలో చూస్తే గత కొన్నేళ్లలో తెలుగులో వచ్చిన అతి పెద్ద బ్లాక్‌బస్టర్లలో ఒకటిగా నిలుస్తుంది ఆర్ఎక్స్ 100. రెండు కోట్ల లోపు బడ్జెట్లో తెరకెక్కిన ఈ చిత్రం రూ.30 కోట్ల దాకా గ్రాస్ కలెక్ట చేసింది. దీనికి శాటిలైట్, డిజిటల్, ఇతర హక్కుల ద్వారా వచ్చిన ఆదాయం అదనం. ఐతే ఇంత పెద్ద హిట్టయిన సినిమాలో నటించేందుకు హీరోయిన్ దొరక్క తాను పడ్డ అవస్థలు అన్నీ ఇన్నీ కావంటున్నాడు దర్శకుడు అజయ్ భూపతి.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో అతను ఆర్ఎక్స్ 100 హీరోయిన్ ఎంపికలో ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి చెప్పుకొచ్చాడు. ఆర్ఎక్స్ 100లో హీరోయిన్‌దే అత్యంత ముఖ్యమైన పాత్ర అని.. కథ ప్రకారం ఓ తెలుగు అమ్మాయి కథానాయికగా నటిస్తే బాగుంటుందని తాను భావించి టాలీవుడ్లో ఉన్న తెలుగు హీరోయిన్లందరినీ సంప్రదించానని.. కానీ ఎవ్వరూ ఒప్పుకోలేదని అజయ్ భూపతి తెలిపాడు.
కొందరు హీరోయిన్లయితే పాత్ర గురించి తెలిశాక కోపంతో గెటౌట్ అని కూడా అన్నట్లు అజయ్ వెల్లడించాడు. ఎంతకీ హీరోయిన్ దొరక్కపోవడంతో తాను ముంబయికి వెళ్లి పాయల్ రాజ్ పుత్ ఫొటోలు చూసి ఆమెను కథానాయికగా ఎంపిక చేసినట్లు తెలిపాడు.
ఐతే ఈ సినిమాపై పాయల్‌కు పెద్దగా నమ్మకాలు లేవని.. కొన్ని రోజుల పాటు మొక్కుబడిగా షూటింగ్‌కు రావడం వెళ్లడం చేసిందని.. దీంతో పాత్ర చెడిపోతుందేమో అని భయపడా్డడని.. తాను వెళ్లి నీ వల్ల సినిమా యూనిట్ అంతా రోడ్డు మీదికి వచ్చేలా ఉందని పాయల్‌తో అన్నానని.. ఆ తర్వాత ఆమెలో మార్పు వచ్చి పాత్రలో ఇన్వాల్వ్ అయి నటించిందని.. దీంతో హీరోయిన్ పాత్ర అద్భుతంగా పండిందని చెప్పాడు అజయ్.
సినిమా చివర్లో కూడా హీరోయిన్ పాత్రలో పరివర్తన రాదని.. ఆమె తన తప్పు తెలుసుకుని సారీ చెప్పి ఉంటే సినిమా ఫ్లాప్ అయ్యేదని.. ఆమెపై కోపంతో ప్రేక్షకులు కసిగా థియేటర్ల నుంచి బయటికి రావడం వల్లే సినిమా అంత బాగా ఆడిందని అజయ్ అభిప్రాయపడ్డాడు.