ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా రిలీజై బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ కలెక్షన్స్ సాధించిన మలయాళ సినిమా 2018. టోవినో థామస్, అపర్ణ బాల మురళి, కుంజకో బోబన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా.. తాజాగా ఆస్కార్ 2024 అవార్డుల కోసం భారత్ నుంచి అధికారికంగా ఎంపికైంది.
వచ్చే ఏడాది ప్రదానం చేసే ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల కోసం బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరిలో ఈ 2018 చిత్రాన్ని సెలెక్ట్ చేశారు. జూడ్ ఆంథోనీ జోసెఫ్ దర్శకత్వం వహించిన చిత్రమిది. ‘2018లో కేరళలో సంభవించిన వరదలు ఎంతటి విధ్వంసం సృష్టించాయో తెలిసిన విషయమే. దాని ఆధారంగానే ప్రతి ఒక్కరూ హీరోనే అంటూ ఈ సినిమాను ఎంతో నేచురల్‌గా తెరకెక్కించారు.
ఈ చిత్రం ఆద్యంతం భావోద్వేగ భరితంగా ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు. మొదట ఈ చిత్రాన్ని మలయాళంలో విడుదల చేయగా మంచి హిట్ అందుకుంది. ఈ సినిమాకు వచ్చిన రెస్పాన్స్‌తో ఇతర భాషల్లో కూడా రిలీజ్ చేయగా.. బాక్సాఫీస్ వద్ద రూ.100కోట్లకుపైగా వసూళ్లను సాధించడంతో పాటు ప్రేక్షకుల చేత కన్నీళ్లు పెట్టించింది. ప్రస్తుతం ఈ 2018 చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ సోనీలివ్‌లో మలయాళ, తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.
ప్రతి ఏడాది ఎన్నో దేశాలు బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరిలో తమ చిత్రాలను ఆస్కార్ అకాడమీకి అధికారికంగా పంపు తుంటాయి. అలా ఈ సారి ఆస్కార్ 2024 అధికారిక ఎంట్రీ కోసం భారత్ నుంచి చాలానే చిత్రాలు గట్టిగానే పోటీ పడ్డాయి. ఫిల్మ్ మేకర్ గిరీశ్ కాసరవల్లి అధ్యక్షతన 17 మంది సభ్యులతో కూడిన ఆస్కార్ కమిటీ.. చెన్నై వేదికగా ఈ పోటీ పడ్డ చిత్రాలను వీక్షించింది. మొత్తం 22 సినిమాలను కమిటీ వీక్షించింది.
ఇందులో ఫైనల్‌గా బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరిలో 2018 సినిమాను సెలెక్ట్ చేసింది. బాలీవుడ్ స్టార్ యాక్టర్ ఆమిర్ ఖాన్ లాగాన్ చిత్రం తర్వాత ఇప్పటి వరకు ఏ ఇండియన్ సినిమా బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరిలో ఆస్కార్ బరిలో తుది వరకు నిలబడలేదు. అంతకు ముందు మదర్ఇండియా , సలామ్ బాంబే సినిమాలే ఈ విభాగంలో పోటీ పడ్డాయి. ఇకపోతే రాజమౌళి RRR ఈ ఏడాది ఆస్కార్ అవార్డును ముద్దాడిన సంగతి తెలిసిందే.