2020లో టాలీవుడ్‌కు అదిరే ఆరంభం లభించిందని అందరూ సంబరపడ్డారు. సంక్రాంతికి వచ్చిన భారీ చిత్రాలు అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు అద్భుత విజయాన్ని సాధించాయి. వసూళ్ల మోత మోగించాయి. మహేష్ బాబు, అల్లు అర్జున్ లాంటి ఇద్దరు సూపర్ స్టార్లు సంక్రాంతికి తెలుగు ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించారు.
ఈ ఊపులో 2020లో సినీ వినోదం మోతెక్కిపోతుందని ఆశించారు అభిమానులు. ‘ఆర్ఆర్ఆర్’తో పాటు ఎన్నో భారీ చిత్రాలు ఈ ఏడాది సందడి చేేసేలా కనిపించాయి. కానీ చూస్తుండగానే పరిస్థితులు మారిపోయాయి. అంచనాలు తలకిందులైపోయాయి. ‘ఆర్ఆర్ఆర్’ వచ్చే ఏడాది సంక్రాంతికి వాయిదా పడిపోయింది. పోనీలే మిగతా భారీ చిత్రాలైనా రేసులో ఉన్నాయి కదా అనుకున్నారు. కానీ కరోనా ధాటికి ఈ ఏడాదిని టార్గెట్ చేసిన భారీ చిత్రాలు చాలానే వెనక్కి వెళ్లిపోయేలా కనిపిస్తున్నాయి.
ప్రభాస్ కొత్త సినిమాకు కరోనా వల్ల పెద్ద దెబ్బే పడింది. ఆ సినిమా స్కేల్ ప్రకారం చూస్తే షూటింగ్ పూర్తి చేసి వివిధ భాషల్లో డబ్బింగ్, పోస్ట్ ప్రొడక్షన్ చేయడానికి చాలా టైం పడుతుంది. కాబట్టి 2020లో ఆ సినిమా రావడం సందేహమే. ఇక అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్లో రాబోయే సినిమాను ఎట్టి పరిస్థితుల్లో దసరాకు రెడీ చేయాలనుకున్నారు.
కానీ ఇప్పటిదాకా షూటింగే మొదలు కాలేదు. అంతా రెడీ చేసుకున్నాక కరోనా దెబ్బకు పనులు ఆగిపోయాయి. సుకుమార్ సినిమాను ఎలా చెక్కుతాడో తెలిసిందే కాబట్టి ఈ ఏడాదికి ఆ సినిమా లేనట్లే. ‘ఆర్ఆర్ఆర్’ పూర్తి చేసి కొత్త సినిమాల్ని ఈ ఏడాదే పట్టాలెక్కించి ఏడాది చివర్లో అయినా ప్రేక్షకుల ముందుకు కొత్త సినిమాలతో వస్తారనుకున్న ఎన్టీఆర్, చరణ్ లాక్ అయిపోయారు. కాబట్టి ఈ ఏడాది వాళ్ల వెండితెర దర్శనం లేనట్లే.
అంతా అనుకున్న ప్రకారం జరిగితే మహేష్ కొత్త చిత్రం ఈపాటికి పట్టాలెక్కాల్సింది. కానీ వంశీ పైడిపల్లితో సినిమా క్యాన్సిల్ అయి.. పరశురామ్ చిత్రాన్ని లైన్లో పెట్టే ప్రయత్నంలో ఉన్నాడు. అది కూడా ఈ ఏడాదికి పూర్తి కాదు. మెగాస్టార్ చిరంజీవికి కొత్త చిత్రం ‘ఆచార్య’ కూడా ఈ ఏడాది చివర్లోపు వస్తుందా అన్నది సందేహంగానే ఉంది. కరోనా ప్రభావం ఇంకెంత కాలం ఉంటుందన్న దాన్ని బట్టే ఈ సినిమా సంగతి తేలుతుంది.
ఐతే పవన్ కళ్యాణ్ రీఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’ మాత్రం చాలా వరకు పూర్తయింది. సాధారణ పరిస్థితులు వచ్చాక రెండు నెలల్లో సినిమా రెడీ అయిపోతుంది కాబట్టి ఈ ఏడాదికి బడా స్టార్ల సినిమాల్లో ఇదొక్కటే దిక్కు అన్నమాట.