టాలీవుడ్ సీనియర్ నటుడు నాగార్జున కుటుంబానికి చెందిన పలు వ్యక్తిగత విషయాలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు.. తీవ్ర దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే. నాగ చైతన్య విడాకులకు బీఆర్ఎస్ నేత కేటీఆర్ కారణమని ఆరోపించిన సురేఖ.. ఆ సమయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇప్పటికే నాగార్జునతో పాటు ఆయన ఫ్యామిలీ మెంబర్స్ స్పందించారు. బాధ్యతయుతమైన పదవిలో ఉండి.. అలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలను, మీ ప్రత్యర్థులను విమర్శించేందుకు వాడుకోకండని నాగార్జున ఇప్పటికే సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలను గౌరవించమని కోరారు. బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, చేసిన ఆరోపణలను ఖండిస్తున్నట్లు తెలిపారు. అవి పూర్తిగా అసంబద్ధం, అబద్ధమని క్లారిటీ ఇచ్చారు. అమల, నాగచైతన్య, అఖిల్, సమంత కూడా సోషల్ మీడియాలో అసహనం వ్యక్తం చేశారు.
అయితే కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల విషయంపై ఇప్పుడు నాగార్జున న్యాయ పోరాటానికి దిగారు. ఆమెపై తాజాగా పరువు నష్టం దావా వేశారు. తమ కుటుంబం యొక్క గౌరవాన్ని, ప్రతిష్ఠను దెబ్బతీసేలా సురేఖ వ్యాఖ్యలు చేశారంటూ నాంపల్లి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తమ పరువుకు భంగం కలిగించారని దావాలో తెలిపారు. క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నాగార్జున కోరారు. ఇప్పుడు ఈ విషయం..
నెట్టింట ఫుల్ వైరల్ అవుతోంది. కాగా.. కొండా సురేఖ ఇప్పటికే తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించారు. తన వ్యాఖ్యల వెనుక ఉద్దేశం వేరేది ఉందని తెలిపారు. మహిళల పట్ల ఒక నాయకుడి చిన్న చూపు ధోరణిని ప్రశ్నించడమే కానీ.. సమంత మనోభావాలను దెబ్బతీయడం కాదని అన్నారు. తన వ్యాఖ్యల పట్ల సమంత కానీ, ఆమె ఫ్యాన్స్ కానీ మనస్తాపానికి గురైనట్లయితే బేషరతుగా తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు చెప్పారు. ఎవరూ అన్యదా భావించవద్దని కోరారు.
అయితే తనకు ఎవరిమీద వ్యక్తిగత ద్వేషం లేదని తెలిపారు కొండా సురేఖ. నాగార్జున కుటుంబ సభ్యులు పెట్టిన పోస్టులు చూసి చాలా బాధపడినట్లు తెలిపారు. కానీ కేటీఆర్ విషయంలో మాత్రం తగ్గేది లేదని, ఆయన క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. కాగా.. ఇప్పటికే తనపై చేసిన ఆరోపణలకు గాను కేటీఆర్.. సురేఖకు నిన్ననే లీగల్ నోటీసులు పంపించారు. తాజాగా నాగార్జున.. ఆమెపై పరువు నష్టం దావా వేశారు.