ఆర్ఆర్ఆర్ మూవీ మొదలైనప్పటి నుంచి ఈ సినిమాలో ఉన్న ఇద్దరు స్టార్ హీరోల్లో ఎవరికి ఎక్కువ వెయిట్ ఉంటుందని.. ఎవరు ఎక్కువగా సినిమాకు ఎసెట్ అవుతారు.. హిట్ క్రెడిట్ ఎవరికి ఎక్కువ వెళ్తుంది అనే విషయాల్లో తెగ కొట్టేసుకుంటున్నారు ఇద్దరు హీరోల ఫ్యాన్స్.
తాజాగా మోషన్ పోస్టర్, సీతారామరాజు క్యారెక్టర్ టీజర్ రిలీజయ్యాక ఈ గొడవలు ఇంకా పెరిగాయి. టీజర్లో చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్ గురించి అతడి అభిమానులు గొప్పలు పోతే.. తారక్ వాయిస్ గురించి తన ఫ్యాన్స్ ఎక్కువ చేసి చెప్పుకుంటున్నారు.
మా వాడు గొప్ప అంటే మా వాడు గొప్ప అని వాదనలకు దిగుతున్నారు. సినిమా క్రెడిట్ విషయంలో ఇప్పుడే వీళ్లు ఇంతగా కొట్టేసుకుంటుంటే.. రిలీజయ్యాక ఎలా ఉంటుందో అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఐతే ఇద్దరు హీరోల్ని ఎలా బ్యాలెన్స్ చేయాలో తెలియనంత అమాయకుడు కాదు రాజమౌళి. అన్నిటికీ మించి సినిమా సక్సెస్ క్రెడిట్ ఎవరికి ఎక్కువ వెళ్తుంది అనే విషయంలో అసలు గొడవ పడటంలోనే అర్థం లేదు. రాజమౌళి సినిమా అంటే.. సక్సెస్‌లో మేజర్ క్రెడిట్ వెళ్లేది ఆయనకే. హీరోల్ని మించిన స్టార్ ఇమేజ్ ఉంది జక్కన్నకు.
ఈగను హీరోగా పెట్టి కూడా బ్లాక్ బస్టర్ కొట్టిన ఘనుడాయన. ఇక రాజమౌళి సినిమాలో హీరోగా ఎవరు చేస్తే ఏంటి.. ఇద్దరు హీరోలు నటించినపుడు ఎవరి పాత్ర ఎలా ఉంటే ఏంటి? ఈ సినిమా కూడా అంచనాలకు తగ్గట్లు ఉండి హిట్టయితే సక్సెస్ క్రెడిట్ మేజర్‌గా రాజమౌళికే వెళ్తుంది తప్ప హీరోలకు పెద్దగా రాదు.
కాకపోతే ఈ సినిమాతో ఇద్దరు హీరోలూ దేశవ్యాప్తంగా జనాలకు పరిచయం అవుతారు. తమ టాలెంట్ ఏంటో చూపిస్తారు. అందరి నోళ్లలో నానుతారు. మార్కెట్ పెంచుకుంటారు. అది వాళ్ల కెరీర్లకు ఉపయోగపడుతుంది. అంతకుమించి క్రెడిట్ గురించి ఫ్యాన్స్ కొట్టేసుకోవడంలో అర్థమే లేదు.