కరోనా వైరస్ ప్రభావంతో ప్రపంచంలో ఎన్నెన్నో చిత్రాలు చూస్తున్నాం. దీని వల్ల కొన్ని సానుకూల మార్పులు కూడా చోటు చేసుకున్నాయి. జనాలు ఎక్కడి వాళ్లు అక్కడ ఇళ్లకే పరిమితం అయిపోవడంతో మిగతా జంతు జాలానికి స్వేచ్ఛ వచ్చింది. వాతావరణ కాలుష్యం బాగా తగ్గిపోయి నగరాల్లో భిన్నమైన దృశ్యాలు కనిపిస్తున్నాయి. ప్రకృతి అందాలకు ఒక్కొక్కరు మైమరిచిపోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా వాతావరణంలో వచ్చిన ఈ మార్పు చూసి అబ్బుర పడ్డారు. తాజాగా ఆయన జూబ్లీ హిల్స్ లో ఎత్తైన కొండ మీద కట్టుకున్న తన కొత్త ఇంటి నుంచి సూర్యోదయాన్ని.. సిటీ వాతావరణాన్ని కెమెరాలో బంధించే ప్రయత్నం చేశారు. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
చిరు ఇంటి ముందున్న స్విమ్మింగ్ పూల్ ను కవర్ చేస్తూ.. సూర్యోదయ దృశ్యాన్ని చిరు బంధించారు. కాలుష్యం బాగా తగ్గడం వల్ల సిటీ ఎంత స్పష్టంగా కనిపిస్తోందో.. సూర్యోదయం కూడా ఎంత అందంగా ఉందో చిరు వివరిస్తూ వచ్చారు. ఆ తర్వాత కెమెరాను రౌండుగా తిప్పుతూ తన ఇంటి వైభవాన్ని కూడా చూపించారు. ఏమాటకామాటే చెప్పుకోవాలి.. చిరు ఇల్లు రాజసౌధం లాగే అనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ఖరీదైన ప్రాంతం అనదగ్గ జూబ్లీ హిల్స్ లో చిరు భారీ సౌధాన్నే నిర్మించుకున్నారు. దీని విలువ ఎన్ని కోట్ల ఉంటుందో అంచనా వేయడం కష్టమే. కరోనా ప్రభావం కారణంగా సెలబ్రెటీలు చాలామంది ఇంటి పట్టునే ఉంటూ హోం టైం వీడియోలను షేర్ చేస్తుండటంతో వాళ్ల లగ్జరీని చూసే అవకాశం అభిమానులకు లభిస్తోంది.