తాత సీనియర్ ఎన్టీఆర్ తెలుగు జాతి ఆస్తి. తెలుగు వారి నిలువెత్తు సంతకం. ఒకే ఒక్కడు మొత్తం తెలుగు జాతిని గర్వంతో తలెత్తుకునేలా చేశారు. ఈ గర్వం తరతరాలకూ చెందేలా అందేలా చేశారు. అలాంటి ఎన్టీఆర్ ని మావాడు అని ప్రతీ తెలుగు గుండె ఆనందంగా చెప్పుకుంటుంది.
మరి నందమూరి వారింట పుట్టి తాత అడుగులలో అడుగులు వేసి తాత సినీ వారసత్వాన్ని మెండుగా నిండుగా కొనసాగిస్తూ ఆయనకు తగ్గ మనవడు అని పేరు తెచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ కి తాత గురించి చెప్పాలంటే ఎలా ఉంటుంది. తన తనువు అంతా ఆయనే అని చెప్పాలి.
తాత పేరును తన పేరుగా పెట్టుకుని ఆ పేరు బరువునూ పరువునూ మోస్తూ రెండు దశాబ్దాలకు పైగా తెలుగు సినీ ఇండస్ట్రీలో తనదైన కొత్త పేజిని క్రియేట్ చేసుకుని సక్సెస్ ఫుల్ గా ముందుకు సాగుతున్న నందమూరి మూడవ తరం చిన్నోడు జూనియర్ ఎన్టీఆర్ తాత ఎన్టీయార్ 101 జయంతి వేళ చాలా ఆసక్తికరమైన ట్వీట్ చేశారు.
అది చదివిన వారికి జూనియర్ ఎన్టీఆర్ మంది నిండా తాత ఎంత పదిలంగా గూడు కట్టుకున్నారో అర్ధం అవుతుంది. ఇంతకీ జూనియర్ వేసిన ట్వీట్ ఏంటి అంటే మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది, మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతోంది పెద్ద మనసులో ఈ ధరిత్రిని ఈ తెలుగు గుండెను తాకిపో తాతా అంటూ ఉంది.
అది చదివిన ప్రతీ తెలుగు వాడు అలాగే అనుకుంటారు. ఎన్టీఆర్ లేని ప్రపంచంలో ఇన్నాళ్ళుగా ఉన్నామా అని కూడా విస్మయం చెందుతారు. ప్రతీ తెలుగు గుండె కూడా ఆయన రూపు కానక తల్లడిల్లుతోంది అన్నది వాస్తవం. నిజంగా కనుక ఈ వరం ప్రసాదించి ఎన్టీఆర్ మరోసారి ఈ భూమి మీద తెలుగు గడ్డ మీద పుట్టాలని అంతా మనసారా కోరుకుంటున్నారు.
అదే మాటను జూనియర్ ఎన్టీఆర్ కూడా తన ట్వీట్ ద్వారా వ్యక్తం చేశారు. చివరిలో మీ ప్రేమకు సదా బానిసను అన్నారు. జూనియర్ మాత్రమే కాదు కోట్లాది మంది తెలుగు వారు అంతా ఆయన ప్రేమకు దాసులే. బానిసలే. ఇదే అక్షర సత్యం. ఇదే అసలైన నిజం. ఒక ఎన్టీఆర్ నడయాడిన నేల మీద మనమూ అడుగులు వేశాం, ఆయన పుట్టిన గడ్డ మీద మనమూ సంచరిస్తున్నాం అని చెప్పుకోవడం కంటే తెలుగు వారికి వేరే గౌరవం గర్వం లేదు అన్నది నూటికి వేయి పాళ్ళు నిజం.