తెలుగుదేశం నాయకులు ఇప్పుడు కొత్త పాట అందుకున్నారు. ప్రజలలో సరికొత్త భయాలను వ్యాపింపజేసి అయినా సరే రాజకీయంగా కనీసం కొంత మేరకు లబ్ధి పొందాలని ఆలోచిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా… తదనంతర పరిణామాలలో సత్వర నిర్వహణకు ప్రభుత్వం చూపించిన శ్రద్ధ అనేది ఒక నెగెటివ్ అంశంగా ప్రచారం చేయడంలో తెలుగుదేశం ఇతర విపక్షాలు చాలా శ్రద్ధ పెట్టాయి.
ఇంత బురద చల్లిన తరువాత… మొత్తం ఎన్నికల ప్రక్రియను కొత్తగా ప్రారంభిస్తే గనుక తమకు కొంత లాభం ఉంటుందనే భ్రమలో విపక్షాలు బతుకుతూ ఉన్నట్లుగా కనిపిస్తోంది. జగన్ సర్కారు క్షేత్రస్థాయిలో ప్రజలకు నేరుగా ఫలితం అందేలాగా అమలులోకి తెచ్చిన అనేకానేక కొత్త సంక్షేమ పథకాల దెబ్బకు, ఈ ఎన్నికల్లో తాము విజయం సాధించడం అసాధ్యం అనే… విపక్షాలు చాలా వరకు అనుకున్నాయి.
చాలా నియోజకవర్గాలలో పోటీ చేయడానికి కూడా వారికి అభ్యర్థులు దొరకలేదు. పార్టీ జెండా పట్టుకొనే వారిని పోటీకి దింపడం అనేది నాయకత్వానికి దుస్సాధ్యం అయిపోయింది. అభ్యర్థులను వేధిస్తున్నారంటూ కొంతమేర విష ప్రచారం చేయడానికి ప్రయత్నించారు. కానీ వర్క్ అవుట్ కాలేదు.
ఆ రకంగా చాలా చోట్ల వారు నామినేషన్లు వేయాకుండానే నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఇప్పుడు ఎన్నికలు వాయిదా పడిన తర్వాత … కరోనా ప్రభావంపై, జగన్ ప్రజల ప్రాణాలు గురించి పట్టించుకోవడం లేదంటూ… కేవలం ఎన్నికల్లో విషయాల మీదనే దృష్టి పెట్టాడంటూ… తీవ్ర ప్రచారం సాగించారు.
ఈ ప్రచారం వలన తమకు కొంత మైలేజీ పెరిగిందని తెలుగుదేశం భావిస్తోంది. ఇప్పుడు కొత్తగా నామినేషన్ల ప్రక్రియ మొదలు అయితే తమకు కొన్నిచోట్ల మైలేజీ ఉంటుందని అనుకుంటున్నారు. అందుకే మొత్తం ఎన్నికల ప్రక్రియను రీషెడ్యూల్ చేసి కొత్తగా ప్రారంభించాలని తెలుగుదేశం నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
నిజానికి, 14వ ఆర్థిక సంఘంతో ముడిపడి రాష్ట్రానికి దక్కవలసిన నిధులు … ఎట్టిపరిస్థితుల్లోనూ రాకుండా చేసే మరొక కుట్రగా కూడా ఈ డిమాండ్ను కొందరు అభివర్ణిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆరు వారాల తర్వాత ఎన్నికలు జరిగినప్పటికీ, అది కేవలం కరోనా కారణంగా వాయిదా పడిన నేపథ్యంలో కేంద్రాన్ని బతిమాలి నిధులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. మొత్తం రీషెడ్యూలు అయితే అలాంటి అవకాశాలు కూడా సన్నగిల్లి పోతాయి.
నిధుల విడుదలను కేంద్రం సులభంగా తిరస్కరించే అవకాశం ఉంటుంది. రాష్ట్రాన్ని మరింత ఆర్థిక సంక్షోభంలోకి నెట్టే కుట్ర ఉద్దేశంతోనే తెలుగుదేశం గాని ఇతర విపక్షాలు గాని ఎన్నికలకు కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చి రీషెడ్యూల్ చేయాలని డిమాండ్ వినిపిస్తున్నారనే అభిప్రాయం విశ్లేషకుల్లో వ్యక్తమవుతోంది. జగన్ సర్కారు ఏ రకంగా ఎదుర్కొంటుందో వేచి చూడాలి.