ఒకప్పటి అందగాడు మాధవన్ ఇప్పుడు ఎలాంటి పాత్రలు పోషిస్తున్నాడో తెలిసిందే. సెకెండ్ ఇన్నింగ్స్ లో ఆయన వయసుకు తగ్గ పాత్రలు చేస్తూ ఎంతో సెలక్టివ్ గా కనిపిస్తున్నాడు. వయసు మళ్లిన వృధుడిగా..ప్రతి నాయకుడిగా… కీలక పాత్రలు పోషిస్తూ మ్యాడీ సంపూర్ణ నటుడు అనిపిస్తున్నారు. నటుడంటే కేవలం హీరో పాత్రలకే పరిమితం కాదని..అన్ని రకాల పాత్రలకు న్యాయం చేస్తున్నారు. ఇటీవలే ఆయన విలన్ గా నటించిన ‘షైతాన్’ బాలీవుడ్ లో మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే.
అజయ్ దేవగణ్ ని ఢీకొట్టే పాత్రలో ఆద్యంతం ఆకట్టుకున్నాడు. తాజాగా అదే హీరోతో కయ్యానికి కాలు దువు తున్నాడు. ప్రస్తుతం అజయ్ దేవగణ్..రకుల్ ప్రీత్ సింగ్ జంటగా ‘దే దే ప్యార్ దే-2’ చిత్రం తెరకెక్కుతుంది. అన్షుల్ శర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. కామెడీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న చిత్రమిది. అయితే కామెడీ చిత్రంలోనూ అజయ్ ని ఎదురించే పాత్రలో నటిస్తున్నాడుట. ఇటీవలే దర్శకుడు మ్యాడీకి స్టోరీ వినిపించాడుట. కథనచ్చడంతో నటించడానికి అంగీకరించినట్లు సమాచారం.
అయితే కామెడీ సినిమాలో మ్యాడీలో విలనిజాన్ని ఎలా హైలైట్ చేయబోతున్నారు? అన్నది ఆసక్తికరం. ఎలాంటి పాత్ర అయినా అవలీలగా పోషించగల నటుడు మాధవన్. పాత్రల పరంగా మ్యాడీ ఎంపిక యూనిక్ గా ఉంటుంది. నాగచైతన్య కథానాయకుడిగా నటించిన సవ్యసాచిలో కూడా విలన్ పాత్ర తో మెప్పించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా ప్లాప్ అవ్వడంతో మాధవన్ హైలైట్ కాలేదు.
ఆ తర్వాత విలన్ గా తెలుగులోనూ అవకాశాలు రాలేదు. కానీ అటుపై మాధవన్ జర్నీ వివిధ పరిశ్రమల్లో సక్సెస్ పుల్ గానే సాగుతుంది. ప్రస్తుతం హిందీ..తమిళ్ లోనే ఎక్కువగా సినిమాలు చేస్తున్నాడు. తెలుగులోనూ విలన్ పాత్రలు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడా మాధవన్ కి మంచి ఫాలోయింగ్ ఉంది. కానీ అలాంటి పాత్రలు చేయాలంటే స్టోరీ యూనిక్ గా ఉండాలి. అలాంటి సినిమాలకే మ్యాడీ కమిట్ అవుతున్నాడు. కెరీర్ ఆరంభంలో ‘యువ’ సినిమాలో కూడా విలన్ గా నటించిన సంగతి తెలిసిందే.