డ్యాన్స్ మాస్టర్ టర్న్డ్ యాక్టర్ టర్న్డ్ డైరెక్టర్ రాఘవ లారెన్స్‌కు మంచివాడిగా పేరుంది. అతను ఎప్పట్నుంచో సేవా కార్యక్రమాలు చే్స్తున్నాడు. అభాగ్యులెందరినో ఆదుకున్నాడు. కానీ ఈ సేవా కార్యక్రమాల విషయంలో అతను పెట్టే మెసేజ్‌లు కొంచెం నాటకీయంగా అనిపిస్తాయి.
ఇప్పుడు కరోనా మహమ్మారిపై పోరులో భాగంగా మూడు కోట్ల విరాళం ప్రకటించినపుడు కూడా లారెన్స్ పెట్టిన మెసేజ్‌లో కొంచెం నాటకీయత కనిపించింది. మూడు కోట్ల విరాళం గురించి చెబుతూ.. అది సన్ పిక్చర్స్ వాళ్లు చంద్రముఖి-2 కోసం ఇచ్చిన అడ్వాన్స్ నుంచి తీసిచ్చానని.. రజనీకాంత్ అనుమతితో ఈ సినిమాలో నటిస్తున్నానని చెప్పుకోవడమే అతిగా అనిపించింది. అది చాలదన్నట్లు తాజాగా ట్విట్టర్లో అతను మరో డ్రమాటిక్ మెసేజ్ పెట్టాడు.
తాను మూడు కోట్ల విరాళం ప్రకటించాక తనకు సినీ పరిశ్రమ నుంచి ఇంకెంతోమంది ఫోన్లు చేశారని.. అనేకమంది తమ సమస్యలు చెబుతూ ఫొటోలు, వీడియోలు పంపారని.. తమకు సాయం చేయమని కోరారని.. ఐతే తాను వాళ్లందరికీ సాయం చేసే పరిస్థితుల్లో లేనని భావించి తన అసిస్టెంట్లకు చెప్పి తాను బిజీ అని చెప్పమని సైలెంటుగా ఉండిపోయానని.. కానీ లోపల గదిలోకి వెళ్లి పడుకుంటే వాళ్ల కష్టాలే గుర్తుకొచ్చాయని.. తనకు నిద్ర పట్టలేదని.. దీంతో మరింతగా తాను సాయం చేయాల్సిన అవసరం ఉందనిపించిందని.. దీనిపై తన ఆడిటర్‌తో మాట్లాడుతున్నా అని.. దీనిపై శనివారం సాయంత్రం 5 గంటలకు ప్రకటన చేస్తానని అన్నాడు లారెన్స్.
తర్వాతేమో 5 గంటలకు లైన్లోకి వచ్చి తన ఆడిటర్ రెండు రోజులు సమయం కావాలన్నాడని.. కాబట్టి తమిళ సంవత్సరాది అయిన ఏప్రిల్ 14న తాను ఏం చేయబోయేది ప్రకటిస్తానని అన్నాడు లారెన్స్. ఎంతమంచి వాడైనప్పటికీ నేరుగా సాయం గురించి మరీ నాటకీయంగా వ్యవహరిస్తున్నాడంటూ లారెన్స్ మీద పంచ్‌లు పడుతున్నాయి.