తెలుగు గేయ రచయితలలో సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్నారు. సిరివెన్నెల సినిమా నుంచి తుది శ్వాస వరకు ఆయన తన పాటలతో ప్రేక్షకుల మనసులు గెలుస్తూనే ఉన్నారు. సిరివెన్నెల పాటని అర్థం చేసుకునే స్థాయికి ప్రేక్షకులను ఎడ్యుకేట్ చేశారని త్రివిక్రం ఒకానొక సందర్భంలో చెప్పిన విషయం తెలిసిందే. త్రివిక్రం చెప్పారని కాదు ఎన్నో సందర్భాల్లో సిరివెన్నెల గారు రాసిన పాటని అర్థం చేసుకుని అనుభూతి పొందిన సందర్భాలు చాలా ఉన్నాయి.
అలాంటి సిరివెన్నెల గారి గురించి నా ఉచ్ఛ్వాసం కవనం అంటూ ఒక ప్రత్యేక కార్యక్రమం ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానెల్ ఈటీవీలో ప్రసారం అవుతుంది. ఈ కార్యక్రమానికి గెస్ట్ గా వచ్చిన రాజమౌళి సిరివెన్నెల తో ఉన్న అనుబంధాన్ని ఆయన కలిసి మాట్లాడిన విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. తన ఫ్యామిలీలో కూడా శాస్త్రి గారికి వీరాభిమానులు ఉన్నారని చెప్పిన రాజమౌళి ఆయన రాసే పాటలు గంభీరంగా ఉన్నా.. ఆయన మాత్రం ఎప్పుడూ సరదాగా ఉంటారని అన్నారు.
సీతారామ శాస్త్రి గారు తనను నంది అని పిలిచేవారు. అలా పిలిచే ఏకైక వ్యక్తి ఆయనే అని అన్నారు రాజమౌళి. అంతేకాదు అర్ధాంగి సినిమా కోసం నాన్న డబ్బంతా పోయి నష్టపోయినప్పుడు ఆయన దగ్గరకు వెళ్లి నాన్న కోసం ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి పాట రాసివ్వమని అడిగా.. అది చూశాక నాన్న ధైర్యంగా మారారు.. ఆ పాట తనకు కూడా చాలా సందర్భాల్లో ఉపయోగపడిందని అన్నారు రాజమౌళి.
బాహుబలి తీసే టైం లో ఒక సినిమా ఇలా చేద్దామని అనుకుంటున్నా కరెక్టా కాదా అని సిరివెన్నెల గారి సలహా అడిగి తీసుకున్నారట రాజమౌళి. RRR లో దోస్తీ పాట ఆయనే రాశారు. అయితే సిరివెన్నెల గారు ఎక్కువగా పాటల్లో భావానికి ప్రాధాన్యత ఇస్తారు. అయితే ఒక్కోసారి ప్రాస కోసం పదాలకు ప్రాధాన్యత ఇస్తుంటారు. దోస్తీ సాంగ్ అలా రాసిందే అని అన్నారు. ఇక నెత్తురు మరిగితే ఎత్తర కొండ సాంగ్ మొత్తం రాయలేకపోయారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కొన్ని పదాలను రాసిచ్చి వాటిని పాటలో వాడుకోవమని అన్నారని సిరివెన్నెల గారిని గుర్తు చేసుకుని ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు రాజమౌళి.
తెలుగు సినీ గేయ రచనకు చెరిగిపోని సంతకం గా మారిన సిరివెన్నెల గురించి ఆయనతో వారికున్న అనుబంధం గురించి రానున్న రోజుల్లో ఎంతోమంది ప్రముఖులు ఈ కార్యక్రమంలో పంచుకోనున్నారు. సిరివెన్నెల గారి పాటలను ప్రేమించే ప్రతి ఒక్కరికి నా ఉచ్ఛ్వాసం కవనం కార్యక్రమం ఒక గొప్ప కానుక అని చెప్పొచ్చు.