భారత రాజకీయ నాయకుల్లో రాహుల్ గాంధీ స్థాయిలో సోషల్ మీడియా ట్రోలింగ్ ఎదుర్కొనే నాయకుడు మరొకరు ఉండరంటే అతిశయోక్తి కాదు. విషయ పరిజ్ఞానం, వాక్చాతుర్యంలో రాహుల్ గాంధీ చాలాసార్లు తేలిపోతుంటాడు. పార్లమెంట్లో మాట్లాడేటపుడు, బయట ఎక్కడైనా జనాల్ని అడ్రస్ చేసేటపుడు మాటల కోసం రాహుల్ తడబడటం.. తనను ప్రశ్నించిన వాళ్లకు సమాధానం ఇవ్వలేక నీళ్లు నమలడం చాలాసార్లు చూశాం.
రాహుల్ వేసే ట్వీట్లు సైతం చాలాసార్లు కామెడీ అయిపోతుంటాయి. తాజాగా రాహుల్ వేసిన ఓ ట్వీట్‌కు బీజేపీ యువ ఎంపీ తేజస్వి సూర్య వేసిన పంచ్ మామూలుగా పేలలేదు. దీన్ని పట్టుకుని మరోసారి నెటిజన్లు రాహుల్ గాంధీని విపరీతంగా పొగిడేస్తున్నారు. తేజస్విని ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..
లాక్ డౌన్ కారణంగా భారత దేశ ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బ తింటోందని.. దీని వల్ల భారతీయ కార్పొరేట్లు చాలా వరకు బలహీనపడి వేరే బలమైన సంస్థలు టేకోవర్ చేయాల్సిన దుస్థితికి చేరుతాయని.. జాతీయ విపత్తు నడుస్తున్న ఇలాంటి సమయంలో విదేశీ సంస్థలు భారతీయ కార్పొరేట్లపై నియంత్రణ సాధించే అవకాశం ఇవ్వకూడదని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాడు రాహుల్.
ఐతే దీనికి బదులుకు కర్ణాటకకు చెందిన తేజస్వి.. తాను రాహుల్‌తో అంగీకరిస్తున్నట్లు ట్వీట్ మొదలుపెట్టాడు. ప్రత్యర్థులపై విరుచుకుపడే తేజస్వి రాహుల్‌తో అంగీకరిస్తున్నట్లు ట్వీట్ చేయడం ఏంటా అని ఆశ్చర్యపోతుంటే.. తర్వాత అసలు ట్విస్ట్ ఇచ్చాడు. భారత సంస్థలను విదేశీయులు టేకోవర్ చేసే విషయంలో జాగ్రత్త వహించాల్సిందే అని. ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీని విదేశీ వ్యక్తి టేకోవర్ చేయడం వల్ల దేశంపై ఎంతటి ప్రతికూల ప్రభావం పడిందో అంతా చూశామంటూ.. పరోక్షంగా రాహుల్ తల్లి సోనియాను టార్గెట్ చేశాడు తేజస్వి. దీంతో రాహుల్‌కు ఏం పంచ్ ఇచ్చావంటూ తేజస్విని పొగుడుతూ.. రాహుల్‌ను ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.