ప్రఖ్యాత హాలీవుడ్ మ్యాగజైన్ వెరైటీ 500 జాబితాలో ఎన్టీఆర్, SS రాజమౌళి పేర్లు అగ్రపథాన ఉన్నాయి. గ్లోబల్ మీడియాలో అత్యంత ముఖ్యమైన వ్యక్తుల జాబితాలో చలనచిత్ర పరిశ్రమ ప్రముఖులలో బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకదిగ్గజం SS రాజమౌళి, అగ్రనిర్మాత ఆదిత్య చోప్రా తదితరులు ఉన్నారు. అంతర్జాతీయ పబ్లికేషన్ వెరైటీ గురువారం గ్లోబల్ మీడియాలో ఈ జాబితాను ప్రచురించింది. వెరైటీ500 జాబితాలో నిర్మాతలు సిద్ధార్థ్ రాయ్ కపూర్, ఏక్తా కపూర్, భూషణ్ కుమార్ సహా ఏడుగురి పేర్లు ఉన్నాయి. వీరందరినీ వెరైటీ ఎడిటోరియల్ బోర్డ్ ఎంపిక చేసింది. ఈ ఎంపికల కోసం సదరు మ్యాగజైన్ విస్తృతమైన పరిశోధనను నిర్వహించింది.
ఈ సంవత్సరం పఠాన్ – జవాన్ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద విజయవంతమైన పునరాగమనాన్ని సాధించిన షారూఖ్ ను ప్రశంసిస్తూ.. ఆధునిక యుగం గొప్ప రొమాంటిక్ స్టార్ తనను తాను యాక్షన్ హీరోగా తిరిగి ఆవిష్కరించుకున్నాడని ప్రచురణ సంస్థ వెరైటీ పేర్కొంది. అలాగే SS రాజమౌళి RRR తో అంతర్జాతీయ ఖ్యాతిని సంపాదించిన జూనియర్ ఎన్టీఆర్, ప్రపంచ ప్రేక్షకుల మనస్సులను హృదయాలను దోచుకున్న ప్రముఖుల జాబితాలో చేరాడు. ఎన్టీఆర్ ప్రధాన స్రవంతి భారతీయ సినిమా విజయానికి అవసరమైన క్వాలిటీస్‌తో లార్జర్ దేన్ లైఫ్ హీరోగాను అలాగే ఏ పాత్రలోనైనా ఒదిగిపోయే ఊసరవెల్లి లాంటి సామర్థ్యాన్ని కలిగి ఉన్నాడు! అని వెరైటీ కోట్ చేయడం ఆసక్తిని కలిగించింది. RRR దర్శకుడు SS రాజమౌళి ఈ సంవత్సరంలో అతిపెద్ద ప్రపంచ సంచలనం అయ్యాడు. భారతదేశంలో వాణిజ్యపరంగా అత్యంత విజయవంతమైన దర్శకుడిగా పేరు పొందారని వెరైటీ ప్రస్థావించింది.
ఆదిత్య చోప్రా తన నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్‌కి చారిత్రాత్మక సంవత్సరం ఇది. చోప్రా ఈ సంవత్సరం ప్రారంభంలో పఠాన్‌ని విడుదల చేసి కొత్త రికార్డులు సృష్టించారు. హిందీ చిత్రాల కోసం కొత్త రూ. 500 కోట్ల క్లబ్‌ను కూడా ప్రారంభించారు. మహమ్మారి సమయంలో మూసేసిన సింగిల్-స్క్రీన్ థియేటర్లను తిరిగి తెరవడం ద్వారా చోప్రా చిత్రం సందడిని తేవడంలో సహాయపడింది“ అని వెరైటీ ప్రశంసించింది. ప్రియాంక చోప్రా నటించిన `ది స్కై ఈజ్ పింక్` చిత్రంతో నిర్మాతగా తన స్వతంత్ర ప్రయాణాన్ని ప్రారంభించిన నిర్మాత సిద్ధార్థ్ రాయ్ కపూర్ తాజా వార్ డ్రామా `పిప్పా`తో ప్రాంతీయ చరిత్రలో కీలకమైన క్షణాలను అన్వేషించినందుకు ఈ జాబితాలో చోటు సంపాదించారు.
టీసిరీస్ భూషణ్‌ని `చిన్న కుమార్`గా అభివర్ణిస్తూ అతడి తండ్రి గుల్షన్ కుమార్ మరణించిన తర్వాత 19 సంవత్సరాల వయస్సులో వ్యాపారాన్ని ఎలా చేపట్టాడు? ఇప్పటికి ఏ స్థాయికి పెంచాడు? అనేది వెరైటీ వివరించింది. భూషణ్ ప్రస్తుతం యానిమల్ బ్లాక్ బస్టర్ విజయంతో స్కైలో ఉన్నాడు. అంతర్జాతీయ ఎమ్మీలను గెలుచుకున్న తర్వాత ఏక్తా కపూర్ గౌరవనీయమైన వెరైటీ 500 జాబితాలో స్థానాన్ని పొందారు. ఎమ్మీ ఏక్తా విజయాల పరిమాణాన్ని గుర్తించింది. వీరితో పాటు, పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ, రెడ్ సీ ఫిల్మ్ ఫెస్టివల్ వ్యవస్థాపకుడు శివాని పాండ్యా మల్హోత్రా, సోనీ పిక్చర్స్ సీఈఓ ఎన్‌పి సింగ్ వంటి ఇతర పేర్లు జాబితాలో ఉన్నాయి.