జస్టిస్ హేమ కమిటీ స్పూర్తితో కోలీవుడ్ లో కూడా నడిగర్ సంఘం విశాక కమిటీ సిఫార్సుతో ఒక ప్రత్యేక కమిటీ ఏర్పాటైన సంగతి తెలిసిందే. దీనికి సీనియర్ నటి రోహిణిని అధ్యక్షురాలిగా నియమితు లయ్యారు. అయితే కమిటీ నియమించి నెల రోజులు కూడా గడవక ముందే ఫిర్యాదుల పరంపర మొదలైనట్లు తాజాగా ఓ మీడియా సమావేశంలో రోహిణి వెల్లడించారు. దీనికి సంబంధించి ఒకరిపై చెన్నై పోలీస్ కమీషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేయడం జరిగింది.
ఇంతకీ ఎవరిపై ఆ ఫిర్యాదు అంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే. ఆయన ఎవరో కాదు డాక్టర్ కాంతరాజ్. ఇటీవల ఓ యూట్యూబ్ చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో డాక్టర్ కాంతరాజ్ సినీ నటీమణులందరూ వ్యభిచారులే అన్నట్లు వ్యాఖ్యానించారు. నటీమణులు కెమెరామెన్, లైట్‌మెన్, మేకప్‌మెన్, దర్శకుడు అందరి కోరిక మేరకు కమిట్ మెంట్ తర్వాతే సినిమాల్లో అవకాశాలిస్తారని నటీమణుల్ని ఉద్దేశించి కించ పరిచి మాట్లాడినట్లు రోహిణి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఎలాంటి ఆధారాలు లేకుండా చేసిన ఆయన వ్యాఖ్యలపై తగిన చర్యలు తీసుకోవాలని, అలాగే ఆ యూట్యూబ్ ఛానల్ నుంచి ఆ ఇంటర్వ్యూను వెంటనే తొలగించాలని ఆమె పేన్కొన్నారు. అయితే తన వరకూ వచ్చిన ఫిర్యాదులపై మాత్రం ఇంకా ఓపెన్ అవ్వలేదు. కమిటీ ఏర్పాటైన వెంటనే చాలా మంది నటీమణులు నుంచి బాధితులు ముందుకొస్తున్నట్లు తెలపడం సంచలనంగా మారింది.
మాలీవుడ్ ఇండస్ట్రీని హేమ కమిటీ నివేదిక వేడెక్కిస్తోన్న వేళ…కొత్తగా కోలీవుడ్ లోనూ కాక మొదలైనట్లు కనిపిస్తుంది. ఇలాంటివి తెరపైకి వస్తే సీన్ ఎలా ఉంటుందన్నది చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీపై రకరకాల ఆరోపణలు తెరపైకి వస్తుంటాయి.