కరోనా కారణంగా మనుషుల్లో భయాందోళనలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. పక్కనున్నవారు దగ్గినా, తుమ్మినా కరోనా ఉందేమోననే అనుమానంతో వింతగా చూస్తున్నారు జనాలు. జాగ్రత్త మంచిదే కానీ కొందరు అతిజాగ్రత్త, అనుమానంతో తోటివారి ప్రాణాలనే తీస్తున్నారు. తాజాగా తన పక్కన మాటిమాటికి దగ్గుతున్నాడనే కోపంతో ఓ యువకుడిపై తుపాకీతో కాల్పులు జరిపాడో వ్యక్తి. స్థానికంగా సంచలనం క్రియేట్ చేసిన ఈ సంఘటన దేశరాజధాని ఢిల్లీకి అతి సమీపంలో వెలుగుచూసింది.
గ్రేటర్ నోయిడాలోని దయానగర్ ఏరియాకు చెందిన 25 ఏళ్ల ప్రశాంత్ సింగ్, లాక్‌డౌన్ కారణంగా ఇంటిదగ్గరే ఉంటున్నాడు. అయితే కాలక్షేపం స్నేహితులతో కలిసి ఇంటి దగ్గర ఉన్న దేవాలయంలో ఆడుకోవడానికి వెళ్లేవాడు. అలా మంగళవారం రాత్రి ముగ్గురు స్నేహితులతో కలిసి ఆడుకుంటున్న సమయంలో జైవీర్ సింగ్ అనే వ్యక్తి అక్కడికి వచ్చాడు. అతను కూడా వారితో కలిసి ఆడుకుంటున్న సమయంలో ప్రశాంత్ సింగ్‌కు దగ్గు వచ్చింది.
మాటిమాటికి దగ్గు తుండడంతో జైవీర్‌కు కరోనా ఏమోనని అనుమానం వచ్చింది. ప్రశాంత్‌ను అక్కడి నుంచి వెళ్లిపోవాలని చెప్పాడతను. ఈ విషయంలో ఇద్దరి మధ్యా మాటామాటా పెరిగి గొడవ జరిగింది. ప్రశాంత్‌కి కరోనా ఉందని, ఇలా దగ్గుతూ అందరికీ అంటిస్తున్నాడని వాదించిన జైవీర్, తన దగ్గర ఉన్న తుపాకీతో అతనిపై కాల్పులు జరిపి పారిపోయాడు.
తీవ్రంగా గాయపడిన ప్రశాంత్‌ను అతని స్నేహితులు ఆసుపత్రిలో చేర్పించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు. బయటికి రావద్దని చెప్పినా, ప్రభుత్వ ఆదేశాలకు పట్టించుకోకుండా బయటికి వచ్చి ఆడుకున్న యువకులపై కూడా పోలీసులు కేసు నమోదుచేశారు. బయటికి వచ్చి ఎవరైనా తుమ్మినా, దగ్గినా కరోనా ఉందేమోనని అనుమానించే బదులు, శుభ్రంగా ఇంట్లోనే ఉంటూ కరోనా వైరస్‌కు దూరంగా ఉండాలని చెబుతున్నారు పోలీసులు.