సుడి అంటే రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీదే. కరోనా వేళ.. పెద్ద పెద్ద డీల్స్ అన్ని పున:సమీక్షలోకి వెళ్లిపోతున్న వేళ.. అందుకు భిన్నంగా గతంలో చేసుకున్న ఒప్పందాలకు కట్టబడి ఉండటం మామూలు విషయం కాదు. ఈ విషయంలో అంబానీ లక్ మామూలుగా లేదనే చెప్పాలి. ప్రపంచ కుబేరుల్లో ఒకరుగా ఉన్న ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ టెలికాం యూనిట్ కు చెందిన జియోలో సోషల్ మీడియా దిగ్గజ సంస్థ ఫేస్ బుక్ భారీగా పెట్టుబడులు పెట్టింది.
మన రూపాయిల్లో చెప్పాలంటే రూ.43,574 కోట్ల మొత్తాన్ని రిలయన్స్ జియోలో పెట్టుబడి పెట్టింది. ఈ విషయాన్ని ఫేస్ బుక్ తాజాగా వెల్లడించింది. దీంతో జియోలో 9.9 శాతం వాటాను ఫేస్ బుక్ కొనుగోలు చేసినట్లైంది. దీంతో జియోలో అతి పెద్ద మైనార్టీ వాటాను ఫేస్ బుక్ సొంతం చేసుకున్నట్లైంది. ఫేస్ బుక్ పెట్టుబడి పెట్టిన తర్వాత జియో విలువ రూ.4.62 లక్షల కోట్లకు పెరిగినట్లుగా చెప్పాలి.
తాజా డీల్ పుణ్యమా అని రిలయన్స్ మీద అప్పుల భారం భారీగా తగ్గిపోనుంది. తాజా పెట్టుబడితో ఫేస్ బుక్ కు భారీగానే ప్లాన్లు ఉన్నాయి. జియోతో కలిసి భారత్ లోని డిజిటల్ ఆపరేషన్లలో తన పరిధిని మరింత విస్తరించుకోవాలని ఫేస్ బుక్ భావిస్తోంది. దీనికి ఊతమిచ్చేలా వాట్సాప్ భారత్ లో సురక్షితమైన డిజిటల్ చెల్లింపులకు అనుమతిని పొందినట్లుగా చెబుతున్నారు. భారత్ లో వాట్సాప్ కు 400 మిలియన్ల యూజర్స్ ఉన్నారు. స్మార్ట్ ఫోన్లు వాడే వారిలో 80 శాతం మంది వాట్సాప్ వాడుతున్నారు. ఈ నేపథ్యంలో జియోలో పెట్టుబడి పెట్టటం ద్వారా భారత్ లోని కొత్త మార్కెట్ అవకాశాల్ని సొంతం చేసుకోవాలన్నది ఫేస్ బుక్ ఆలోచనగా చెబుతున్నారు. తమ వ్యాపారాన్ని పెంచుకోవటానికి జియోను వాడుకోనుంది ఫేస్ బుక్. అందులో భాగంగానే భారీ పెట్టుబడి పెట్టినట్లుగా మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.