బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ చురుకైన సామాజిక కార్యకర్త . ఆమెకు సామాజిక స్పృహ ఎక్కువే. ఆపదలో ఉన్న వాళ్లను ఆదుకోవాలనే సేవా దృక్పథం ఆమెలో మెండు. కరోనా మహమ్మారిపై పోరులో ముందు వరుసలో నిలిచిన వాళ్లకు అండగా నిలిచేందుకు తనతో చేయి కలపాలని ఆమె విన్నవించుకుంటున్నారు. ఇప్పటికే తనకు సినీ నిర్మాత మనీష్ ముంద్రా, ఫొటోగ్రాఫర్ అతుల్ కస్‌బేకర్ తోడుగా నిలిచినట్టు ఆమె వెల్లడించారు.
కరోనా మహమ్మారిపై పోరాటం చేస్తున్న వైద్యులు, సిబ్బంది కోసం వెయ్యి పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్‌మెంట్ (పీపీఈ) కిట్లను విరాళంగా ఇవ్వనున్నట్లు విద్యాబాలన్ పేర్కొంది. ఈ విషయాన్ని తన ఫేస్‌బుక్‌లో షేర్ చేసిన వీడియోలో వెల్లడించారు. ఆ వీడియోలో.. ‘ కోవిడ్-19పై వైద్యులు చేస్తున్న పోరాటం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. దేశ సైనికులు బోర్డర్‌లో నిలబడి దేశ కోసం తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి మనకోసం కోసం కాపలా కాస్తున్నారు. ఇప్పుడు కరోనాపై యుద్దం చేస్తున్న వైద్యులు కూడా అలాగే కనిపిస్తున్నారు. మనకోసం ఇంతచేస్తున్న వైద్యులను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే. అందుకోసమే పీపీఈ కిట్ల కోసం నిధుల సేకరణ మొదలు పెట్టాను’ …. అంటూ ఆమె వైద్యుల గొప్పదనాన్ని వివరించారు.
అలాంటి వాళ్లకు అండగా నిలిచేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఆమె అభ్యర్థించారు. అదెలాగో తెలుసుకుందాం… ‘నాకు తోడుగా సినీ నిర్మాత మనీష్ ముంద్రా, ఫోటోగ్రాఫర్ అతుల్ కస్‌బేకర్ అండగా ఉన్నారు. రండి నాతో చేయి కలపండి.. మీ అందరి సహకారం ఉంటే మన హీరోలకు మరింత సాయం చెయ్యొచ్చు’ అంటూ విద్యాబాలన్ చెప్పుకొచ్చారు. వైద్యుల గురించి ఆలోచించడంతో పాటు వారికి పీపీఈ కిట్లను అందించేందుకు చొరవ చూపిన బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్‌ను అభినందించాల్సిందే.