ఈ రూమర్స్ అనేవి ఎక్కడ నుండి వస్తాయో, ఎలా పుట్టుకొస్తాయి తెలీదు కానీ వినడానికి మాత్రం భలే విచిత్రంగా ఉంటాయి. ఈ లాక్ డౌన్ వల్ల ఇలాంటి అర్ధం పర్ధం లేని రూమర్లు కోకోల్లలుగా వస్తున్నాయి. అందులో మెగాస్టార్ చిరంజీవి గురించిన రూమర్స్ మరీ ఎక్కువగా వస్తున్నాయి. ఈ లాక్ డౌన్ సమయంలోనే ఆచార్యకు సంబంధించిన బోలెడన్ని విశేషాలను మనతో షేర్ చేసుకున్న చిరు, తన తర్వాతి సినిమా మలయాళ రీమేక్ లూసిఫెర్ అని చెప్పడం విశేషం. దానికి సుజీత్ ను దర్శకుడిగా ఎంచుకున్న విషయాన్ని కూడా తెలియజేసాడు.
ఇక అక్కడినుండి మొదలయ్యాయి ఈ సినిమా మీద రూమర్స్. తెలుగు ప్రజలకు అనుగుణంగా ఈ కథలో సుజీత్ మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. చిరంజీవి కోసం హీరోయిన్ ను పెడుతున్నారని, ఐటెం సాంగ్ కూడా ఉంటుందని అన్నారు. ఇక ఈ సినిమాలో కీలకమైన స్పెషల్ రోల్ ఒకటి ఉంది. దానికి మొదట స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చేస్తాడని వార్తలు వచ్చాయి. రెండు, మూడు రోజుల నుండి ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఆ స్పెషల్ రోల్ చేస్తాడని, హిందీలో కూడా ఈ సినిమాను విడుదల చేయనున్నారని అన్నారు.
అయితే వాటిలో ఎటువంటి నిజం లేదని తెలుస్తోంది. సల్మాన్ ఖాన్ ప్రస్తుతం వరస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇలాంటి సమయంలో తెలుగులో సినిమా చేయడం జరగని పని. అసలు విషయం సల్మాన్ వరకూ వెళ్లలేదని, చిరు అండ్ టీమ్ కు ఆ తరహా ఆలోచన లేదట. ఇక బన్నీ న్యూస్ కూడా ఒట్టి రూమరే అనుకోవచ్చు. ఎందుకంటే బన్నీ ఇప్పుడు పుష్ప సినిమా కోసం గ్యాప్ లేకుండా పనిచేయాల్సి ఉంటుంది. ఇప్పటికే సినిమా చాలా ఆలస్యమైంది. దాని గురించి గెటప్ కూడా పూర్తిగా మార్చుకున్నాడు.