ప్రజలకు మేలు కలిగే ఏ చర్యలు ప్రభుత్వం తీసుకున్నా అభినందించి తీరాల్సిందే. రేషన్ దుకాణాలంటే అవినీతికి, దోపిడీకి కేరాఫ్ అడ్రస్ అనే అభిప్రాయాలు ఇప్పటికీ వున్నాయి. అంతెందుకు, ఈ మధ్యనే రేషన్ బియ్యం పక్కదారి పట్టిన వైనం విశాఖ జిల్లాలో వెలుగు చూసింది. అధికార పార్టీ ఎంపీనే ఈ విషయమై తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సదరు ఎంపీగారికి చెందిన ట్రస్ట్‌కి రేషన్ బియ్యం తరలి వెళుతున్న వ్యవహారం బట్టబయలయ్యింది. ఆ సంగతి పక్కన పెడితే, ప్రభుత్వం రేషన్ బియ్యం విషయమై కీలక నిర్ణయం తీసుకుంది.
రేషన్ బియ్యాన్ని సెప్టెంబర్ 1 నుంచి డోర్ డెలివరీ చేయనుంది వైఎస్ జగన్ ప్రభుత్వం. ఇందు కోసం సాంకేతిక పరిజ్ఞానాన్నీ వినియోగించుకోబోతోంది. ప్రత్యేకంగా తయారు చేసిన సంచులతోపాటు, బియ్యాన్ని డోర్ డెలివరీ చేసేందుకు అనుగుణంగా ఓ ప్రత్యేక వాహనాన్నీ అందుబాటులోకి తెస్తున్నారు. మొత్తం 13,370 మొబైల్ యూనిట్ల ద్వారా ఇంటి వద్దకే నాణ్యమైన బియ్యాన్ని డోర్ డెలివరీ చేయనుంది ప్రజా పంపిణీ వ్వవస్థ.
లబ్దిదారుల ముందే బస్తా సీల్‌ని ఓపెన్ చేసి, వారికి నిర్దేశించిన కోటా ప్రకారం ఈ కొత్త విధానం ద్వారా అందించనున్నారట. నిజంగానే అభినందించాల్సిన విషయమిది. అయితే, నాణ్యమైన బియ్యం స్థానంలో సన్నబియ్యం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించి వుంటే బావుండేది. ఈ నాణ్యమైన బియ్యం – సన్నబియ్యం చుట్టూ నానా యాగీ జరుగుతున్న విషయం విదితమే.
వైఎస్ జగన్, ఎన్నికల ప్రచారంలో ‘సన్నబియ్యం’ ప్రస్తావన తీసుకురాగా, అదంతా ఉత్తదేనని ఆ తర్వాత అదే వైఎస్ జగన్, ముఖ్యమంత్రి అయ్యాక బుకాయించారు. ఆఖరికి తన సొంత పత్రిక సాక్షిలో వచ్చిన కథనాల్నీ తప్పుడు కథనాలుగా కొట్టి పారేశారు వైఎస్ జగన్.
ఏదిఏమైనా, ప్రజా పంపిణీకి సంబంధించి ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా చేయగలిగితే, వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని అభినందించి తీరాల్సిందే. కానీ, రేషన్ బియ్యాన్ని నమ్ముకున్న రాజకీయ పందికొక్కులు ఈ కార్యక్రమాన్ని సజావుగా సాగనిస్తాయా.? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న.