ఈ రోజు మాతృ దినోత్సవం. ఈ సందర్భంగా తన తల్లి గురించి హీరోయిన్ మెహరీన్ ఎంతో గొప్పగా చెప్పారు. లాక్‌డౌన్ సమయంలో ఆమె తన అభిప్రాయాలను వివిధ మీడియా సంస్థల వేదికగా అభిమానులతో పాటు సమాజంతో పంచుకున్నారు. అమ్మ గురించి మెహరీన్ మాటలు వింటే దైవాన్ని ప్రత్యక్షంగా చూడలేదనే బెంగ తీరుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ హీరోయిన్ దైవాన్ని సాక్ష్యాత్కరింపజేసింది.
అమ్మ (పమ్మీ పిర్జాదా) ఒకే ఒక్క మాటతో జీవితానికో చక్కటి బాట వేసిందని చెప్పొచ్చన్నారు మెహరీన్. ‘జీవితంలో ప్రతి ఒక్కరికీ రెండు ఛాయిస్‌లు ఉంటాయి. ఒకటి… ఇప్పుడు బాగా కష్టపడి, తర్వాత జీవితంలో సుఖపడడం! రెండు… ఇప్పుడు బాగా ఎంజాయ్ చేసి, తర్వాత జీవితంలో బతకడానికి కష్టపడడం’ అని! ‘మీరు ఏ దారి ఎంచుకుంటారో మీ ఇష్టం’ అని అమ్మ చిన్నప్పుడు చెప్పిన మాట…తనకిప్పటీ జీవితానికి మార్గనిర్దేశం చేసినట్టైందని ఆమె తెలిపారు.
బాల్యంలోనే అమ్మ ఉగ్గుపాలతో పాటు జీవిత సూత్రాలను నేర్పిందని, వాటినే తానిప్పుడు ఆచరిస్తున్నానని ఆమె అన్నారు. చదువు విషయంలో కూడా అమ్మ ఎప్పుడూ తన అభిప్రాయాలను తమపై రుద్దాలని ప్రయత్నించలేదని చెప్పారామె. అయితే ఏం చేసినా ఇష్టపడి చేయాలనే సూత్రాన్ని మాత్రం పాటించాలని గట్టిగా చెప్పేవారన్నారు. ‘మీరు ఏం చేసినా… ఇష్టంగా చేయండి. వందశాతం బెస్ట్ ఇవ్వండి’ అని తన తల్లి బోధించేవారని మెహరీన్ వెల్లడించారు.
తన జీవితంలో అమ్మ దగ్గర ఎలాంటి దాపరికాలు లేవన్నారు. తాము తల్లీకూతుళ్లలా కాకుండా స్నేహితుల్లా ఉంటామని చెప్పుకొచ్చారు. అయితే పరిస్థితులకు అనుగుణంగా అమ్మ వ్యవహరిస్తుందన్నారు. జీవితానికో మార్గదర్శగా, తత్వవేత్తగా, స్నేహితురాలిగా…ఇలా అనేక రూపాల్లో అమ్మ తనకు అన్ని వేళలా అండగా నిలుస్తోందన్నారు. అమ్మతో ప్రతిరోజూ మధురమైన జ్ఞాపకమే అని అంటున్నారామె.
చివరిగా మెహరీన్ చెప్పిన మాటలు దైవాన్ని సాక్ష్యాత్కరింపజేసేలా ఉన్నాయని అంటే అతిశయోక్తి కాదు. అవేంటో తెలుసుకుందాం.
‘అమ్మంటే బెస్ట్ ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్. అందుకే నా దృష్టిలో అమ్మంటే సర్వం. ఈ భూమిపై ప్రత్యక్షంగా కనిపించే దైవం అమ్మ. నేనెప్పుడూ నేరుగా భగవంతుణ్ణీ, దేవతలనూ చూడలేదు. చూస్తానని కూడా అనుకోను. కానీ నా దైవం అమ్మే. మా అమ్మే కాదు…ప్రతి తల్లీ దేవతే. ప్రతి ఒక్కరూ అమ్మను గౌరవించండి. ప్రేమించండి. సంతోషంగా ఉండేలా చూసుకోండి’ అని హీరోయిన్ మెహరీన్ తల్లి పట్ల ఆరాధన భావాన్ని వెల్లడించారు. మాతృదినోత్సవం నాడు అమ్మగొప్పదనాన్ని చాటి చెప్పిన మెహరీన్‌ను అభినందించకుండా ఎలా ఉంటాం?