Advertisement

సిరీస్ రివ్యూ: లూజర్

Posted : May 18, 2020 at 8:40 pm IST by ManaTeluguMovies

థియేటర్లు మూత పడిన వేళ, ఓటీటీని వెండితెరకి ప్రత్యామ్నాయంగా ఇంకా తెలుగు సినిమా గుర్తించని సమయాన… వెబ్ సిరీస్‌లతో సినీ ప్రియులు కాలం గడుపుతున్నారు. ఫలానా ఇంగ్లీష్ సిరీస్, ఫలానా హిందీ సిరీస్, ఫలానా స్పానిష్ సిరీస్ అంటూ సోషల్ మీడియాలో వివిధ భాషలకి చెందిన సిరీస్ గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నారు. అంటే తెలుగువాళ్లు సిరీస్‌లు తీయడం లేదా? తీస్తున్నారు… కానీ చూసి చెప్పుకునేంత గొప్పగా ఉండట్లేదంతే. ఓ కథని గంటన్నరలో చెప్పొచ్చు, మూడు గంటల్లో చెప్పొచ్చు… అయిదారు గంటల్లో చెప్పవచ్చు. సిరీస్‌లలో కథలని అయిదు నుంచి పది గంటల పాటు చెబుతారు. ఎపిసోడ్లుగా విభజించి సిరీస్ పేరిట ఓటీటీల్లో విడుదల చేసే వీటికి ఇప్పుడు పిచ్చ క్రేజు. అందుకే అన్ని భాషల నుంచి సిరీస్‌ల రూపకల్పన జోరందుకుంది.

అయితే అన్ని గంటల పాటు ఒక కథని చెప్పాలంటే… ప్రేక్షకుడి ఆసక్తిని అంతసేపు నిలబెట్టుకోవాలి. రెండు గంటల సినిమాలో పది నిమిషాల పాటు కథ ముందుకి సాగకపోతేనే మొబైల్ బయటకు తీసేసే ప్రేక్షకుల అటెన్షన్‌ని సిరీస్ పూర్తయ్యే వరకు పట్టి ఉంచడం అంత ఈజీ కాదు. అందుకే తెలుగు నుంచి ఇంతవరకు వచ్చిన చాలా సిరీస్‌లు కనీసం గుర్తింపుకి కూడా నోచుకోలేకపోయాయి. ఈ నేపథ్యంలో అభిలాష్ రెడ్డి అనే యువ దర్శకుడు తీర్చిదిద్దిన ‘లూజర్’ అనే సిరీస్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ప్రచారం పొందుతోంది. ఈ ‘జీ5 ఒరిజినల్ సిరీస్’ చూసిన వాళ్లలో చాలా మంది దీనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఏ కథ అయినా జనంలోంచి పుట్టినదయితే ఇట్టే ఆకట్టుకుంటుంది. అభిలాష్ ఎంచుకున్న కథ, ఆ కథని నడిపించే పాత్రలు అన్నీ అత్యంత సహజంగా వుండడంతో ‘లూజర్’ మన కథలా, లేదా మనం చూసిన/చూస్తోన్న కథలా అనిపిస్తుంది.

ఈ స్టోరీని మూడు దశకాలలో సెట్ చేసి, మూడు ప్రధాన పాత్రలతో చెప్పాడు దర్శకుడు. పేద క్రీడాకారులకి ఏ దశకంలో అయినా, ఏ దశలో అయినా ఈ దేశంలో అవే ఎదురు దెబ్బలు, అవే అవరోధాలు అనేది దర్శకుడు చెప్పకుండానే చెబుతాడు.

విల్సన్ కథ: 1985 కాలంలో ఇండియన్ టీమ్‌లో చోటు కోసం అహర్నిశలు కృషి చేసే ఫాస్ట్ బౌలర్ విల్సన్ (శశాంక్). దుందుడుకు స్వభావానికి తోడు కొన్ని కారణాలు అతడికి ఇండియన్ టీమ్‌లో చోటు రాకుండా అడ్డుకుంటాయి. దాంతో అతను తాగుడుకి బానిసగా మారి కెరీర్ పాడు చేసుకుంటాడు.

రూబీ షబానా కథ: 1993లో ఒక ముస్లిమ్ బాలిక (ఆనీ) బ్యాడ్మింటన్ క్రీడలో రాణించాలని కలలు కంటూ వుంటుంది. అమ్మాయిలు ఆటలాడడాన్ని అస్సలు సహించని ఆమె తండ్రికి తెలియకుండా కోచింగ్ తీసుకుంటూ వుంటుంది. తండ్రి మనసు కూడా మార్చుకుంటుంది కానీ ఆడవాళ్లకి క్రీడలలో ఎదురయ్యే అవరోధాలని అధిగమించలేకపోతుంది.

సూరి యాదవ్ కథ: 2007లో ఎయిర్ రైఫిల్ షూటింగ్ స్టేట్ ప్లేయర్ అయిన సూరి యాదవ్‌కి (ప్రియదర్శి) నేషనల్స్‌కి వెళ్లే అవకాశం దక్కుతుంది. పెయింటింగ్స్ వేసుకుంటూ పొట్ట పోసుకునే అతను నేషనల్స్‌లో చోటు కోసం అయిదు లక్షలు సంపాదించాల్సిన అవసరం పడుతుంది. అన్ని ప్రతికూలతలని ఎదుర్కొని సూరి గెలుస్తాడా? ‘లూజర్’గా మిగిలిపోతాడా?

క్రీడాకారుల కథలు మనకి కొత్తవేమీ కాదు. పలు చిత్రాలలో క్రీడల నేపథ్యంతో పాటు వారు ఎదుర్కొనే కష్టనష్టాలు, పరిస్థితులు వగైరా చూపించేసారు. ‘లూజర్’లో కూడా సగటు క్రీడా నేపథ్యమున్న సినిమాల తాలూకు రెగ్యులర్ అంశాలు చాలానే పెట్టారు. అయితే ఈ పాత్రలు, పరిస్థితులు అత్యంత సహజంగా అనిపించడం, అందులోను ఒకే క్రీడాకారుడి కథ కాకుండా మూడు కాలమానాల్లో ముగ్గురి జీవితాలు ఆవిష్కరించడంతో ‘లూజర్’ ఆసక్తి కలిగించడంతో పాటు సదరు పాత్రలతో ప్రయాణం చేయిస్తుంది. మూడు కాలమానాలు, మూడు కథలు అని కాకుండా… వాటిని ఇంటర్‌లింక్ చేస్తూ దర్శకుడు అభిలాష్ ప్రతిభ చాటుకున్నాడు. ఈ తరహా ‘ఆంథాలజీ’ సినిమాలు కూడా మనం చాలానే చూసి వున్నాం కనుక కన్‌ఫ్యూజన్లు గట్రా వుండవు.

క్రీడాకారులకి ఎదురయ్యే సమస్యలు ఏవీ మనకు కాల్పనికంగా అనిపించవు. అన్నీ సహజసిద్ధంగా, మనం రోజూ చూసేవిలానే అనిపించడం ‘లూజర్’ తాలూకు మొదటి విజయ లక్షణం అని చెప్పవచ్చు. ఇక ఆ పరిస్థితులకి సదరు పాత్రల తాలూకు రియాక్షన్లు కూడా రియాలిటీకి దగ్గరగా వుండడం మరో ప్లస్ పాయింట్. ఆరంభంలో కాస్త నిదానంగా సాగే కథనం ఎపిసోడ్లు ముందుకి కదిలేకొద్దీ వేగం పుంజుకుని ఆసక్తి కలిగిస్తుంది. సదరు పాత్రలతో కనక్ట్ ఏర్పడి వారి విజయం కోసం కాంక్షించేట్టు చేస్తుంది. ఏ కథకి అయినా ఇలాంటి ఎమోషనల్ కనక్ట్ ఏర్పడేట్టు చేయడమే అత్యంత కీలకం. ఈ విషయంలో దర్శకుడి టాలెంట్ పూర్తిగా కనిపించింది. ఎమోషనల్ సీన్స్ అన్నీ కూడా ఎఫెక్టివ్‌గా రావడంతో మధ్యలో చిన్నపాటి ఇబ్బందులు కూడా కవర్ అయిపోయాయి.

రూబీ కథకి చక్కని ఆర్క్ సెట్ అయింది. ఆమెకి ఎదురయ్యే వివిధ పరిస్థితులు, క్రీడలలో రాణించాల్సిన యువతి సగటు మధ్య తరగతి గృహిణిగా పడే కష్టాలు, తను సాధించలేకపోయిన దానిని మరొకరి విజయంలో చూసుకుని పొందే ఆనందం, పరిస్థితులకి తలొంచుకోవడం అవాటు పడిన తానే వాటికి ఎదురు చెప్పి, చాచి కొట్టేంత పెరిగిన ధైర్యం… ఒక పూర్తి స్థాయి సినిమా స్టోరీకి తగ్గ త్రెడ్ రూబీది. బాలికగా ఆనీ, యువతిగా కల్పిక ఇద్దరూ ఈ పాత్రకి తగిన న్యాయం చేసారు. ముస్లిమ్ అమ్మాయి తండ్రికి తెలియకుండా సీక్రెట్‌గా తన టాలెంట్‌ని చూపించడమనేది ‘సీక్రెట్ సూపర్‌స్టార్’ సినిమాలో సిట్యువేషన్‌ని తలపిస్తుంది కానీ ఓవరాల్‌గా ఈ లూజర్‌లో రూబీది బెస్ట్ అండ్ కంప్లీట్ స్టోరీ.

సూరి యాదవ్ కథలో కూడా ఎత్తుపల్లాలు బాగా కుదిరాయి. అన్నయ్య కష్టాన్ని గుర్తించని ఒక పొగరుబోతు తమ్ముడు మొత్తం తమ భవిష్యత్తునే ప్రశ్నార్ధకం చేసుకోవడం, సూరి గతంలోంచి ఒక వెలుగు రేఖ వచ్చి వారిని ఆ చీకటి దాటించడం చాలా చక్కగా అమరిపోయింది. సూరి ప్రియురాలు కూడా తన లక్ష్యానికి అనుకోని అవాంతరం కావడం, దానికి సూరి సగటు మనిషిలా పరిష్కారం వెతుక్కోవడం… అన్నీ బాగున్నాయి. సూరి పడే కష్టాలు, రైఫిల్ కోసం అతను పడే ఇబ్బందులు ‘జెర్సీ’లో నానిని గుర్తు చేస్తాయి. అతని గాళ్‌ఫ్రెండ్‌కి ఎదురయ్యే ఇబ్బంది ‘డియర్ కామ్రేడ్’లో రష్మిక పాత్రని తలపుకి తెస్తుంది. సూరి పాత్రని ప్రియదర్శి చాలా సిన్సియర్‌గా పోషించాడు. అతని ప్రేయసిగా పావనికి కూడా బలమైన సన్నివేశాలు పడ్డాయి.

విల్సన్ కథ ఒక్కటే సంపూర్ణంగా అనిపించదు. అతనికి ఎదురయింది అవరోధం కంటే స్వయంకృతంలా అనిపిస్తుంది. ఆ విషయాన్ని శశాంక్‌తో చివర్లో అనిపించినా కానీ ఒక్కసారి తాగుడుకి బానిసగా మారిన తర్వాత ఈ ట్రాక్ జీవం కోల్పోయి, మిగిలిన కథ మధ్యలోకి వచ్చిన ప్రతిసారీ పంటి కింద రాయిలా తగుల్తుంటుంది. అయితే ఈ విల్సన్ ట్రాక్‌ని సూరి కథకి జోడించిన విధానం, సూరికి ఆ పాత్ర దిశానిద్దేశం చేయడం బాగుంది. హిందీ సిరీస్‌లలో వాస్తవికత కోసం బూతు మాటలు పెట్టడం సర్వ సాధారణమయింది. సూరి తమ్ముడి ట్రాక్‌లో ఆ ట్రెండ్‌ని దర్శకుడు ఫాలో అయ్యాడు కానీ క్లీన్‌గా వుంచేసినా పోయేదేమి వుండేది కాదు. సిరీస్‌లని కూడా ఫ్యామిలీ ఆడియన్స్‌ని దృష్టిలో వుంచుకుని క్లీన్‌గా వుంచడమే మంచి పద్ధతి.

ఎక్కడా క్వాలిటీ పరంగా రాజీ పడినట్టు కనిపించలేదు. తక్కువ లొకేషన్లు, తక్కువ పాత్రలతోనే నడిపించినా కానీ పది భాగాలుగా వున్న ఈ సిరీస్ ఎక్కడా విసుగెత్తించలేదు. సాంకేతికంగా కూడా ఉన్నత ప్రమాణాలు పాటించారు. ముఖ్యంగా సంభాషణలతో ఆకట్టుకున్నారు. ‘బీడీకి రూపాయే… బిచ్చగానికిచ్చినా రూపాయే. పైసల విలువ ఎంత ఖర్చుపెడుతున్నాం అనే దాంట్లో వుండదు, ఎందుకు ఖర్చు పెడుతున్నాం అన్నదాంట్లో వుంటది’, ‘ఓడిపోవడమంటే దారుల్లేక పోవడం కాదు, ఉన్నదారి వెతుక్కోలేకపోవడం’ లాంటి మంచి మాటలు కోకొల్లలు. నేపథ్య సంగీతం ఈ కథ రసవత్తరంగా మారడంలో దోహదపడింది.

సిరీస్ రూపొందించే విషయంలో నెలకొన్న సందిగ్ధాన్ని తొలగిస్తూ… ఎలాంటివి చేస్తే ఎఫెక్టివ్‌గా వుంటాయి, మరొకరికి రికమండ్ చేసేలా అనిపిస్తాయి అనేదానికి లూజర్ ప్రతీకగా నిలుస్తుంది. పెద్దగా ప్రమోషన్ లేకపోయినా కంటెంట్ తాలూకు క్వాలిటీతోనే ప్రచారం పొందుతోన్న ఈ సిరీస్‌నుంచి స్ఫూర్తి పొంది మరింతమంది మన కథలు చెప్పడానికి స్ఫూర్తినిస్తుంది.


Advertisement

Recent Random Post:

KCR (Keshava Chandra Ramavath) Pre Release Event LIVE | Rocking Rakesh, Annanya Krishnan | Anji

Posted : November 18, 2024 at 7:35 pm IST by ManaTeluguMovies

KCR (Keshava Chandra Ramavath) Pre Release Event LIVE | Rocking Rakesh, Annanya Krishnan | Anji

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad