మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో ఈ రోజు ఉదయం పదిన్నరకు తలపెట్టిన సినిమా ఇండస్ట్రీ సమావేశానికి మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ కూడా హాజరవుతున్నారని తెలుస్తోంది. కరోనా నేపథ్యంలో అండర్ ప్రొడక్షన్ లో వున్న సినిమాల పని ఎప్పుడు ఎలా ప్రారంభించాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఇండస్ట్రీ సమస్యలు తదితర విషయాల మీద ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు.
ఇండస్ట్రీలో యాక్టివ్ గా వున్న పెద్ద నిర్మాతలు, అలాగే టాప్ లైన్ దర్శకులు, నిర్మాణాల్లో పాలు పంచుకునే కొంత మంది హీరోలు ఈ సమావేశానికి హాజరవుతారని తెలుస్తోంది. సినిమా ఇండస్ట్రీ సమస్యల పరిష్కారం విషయంలో యాక్టివ్ గా వున్న మంత్రి తలసాని కూడా ఈ సమావేశానికి హాజరవుతున్నట్లు బోగట్టా.
ముఖ్యంగా అండర్ ప్రొడక్షన్ లో వున్న సినిమాల నిర్మాతలు, దర్శకులు వుంటారని తెలుస్తోంది. రాజమౌళి, కొరటాల శివ తదితర దర్శకులు, దానయ్య, చినబాబు, బోగవిల్లి ప్రసాద్ లేదా ఆయన తనయుడు బాపినీడు, దిల్ రాజు, అల్లు అరవింద్, మైత్రీ రవి, బన్నీవాస్, తదితరులు ఈ సమావేశానికి రానున్నట్లు తెలుస్తోంది. హారిక సంస్థ తరపున నిర్మాత చినబాబు వెళ్తారు. కానీ త్రివిక్రమ్ వెళ్తారో? వెళ్లరో ఇంకా తెలియలేదు. అలాగే ఆసియన్ సునీల్, సురేష్ బాబు సంగతి కూడా తెలియాల్సి వుంది.
దగ్గర దగ్గర నలభై మంది వరకు వుండొచ్చని ఓ అంచనా. సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ, అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఈ సమావేశాన్ని నిర్వహిస్తారని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.