ప్రముఖ హీరోయిన్ భావోద్వేగానికి లోనయ్యారు. దీనికి కారణం బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యే. మానసిక ఒత్తిళ్లను తట్టుకోలేక చివరికి అతను చావును ఆశ్రయించాడు. సుశాంత్ బలవన్మరణం ప్రతి ఒక్కర్నీ కదిలించింది. ఈ నేపథ్యంలో హీరోయిన్ అనుష్క ఎంతో ఆవేదనతో సోషల్ మీడియా ద్వారా తన భావాలను పంచుకున్నారు. మనమెవరూ కూడా రోడ్డు మ్యాప్‌తో పుట్టలేదని ఆమె చెప్పుకొచ్చారు.
ఆత్మహత్యకు పాల్పడకూడదంటూ ఆమె చేసిన సూచనలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. అవేంటో చూద్దాం.
‘ఎవరూ పర్ఫెక్ట్ కాదు. ఇదే సరైన మార్గం, ఇది సరికాని మార్గం.. అంటూ ఏమీ ఉండవు. మనమంతా రోడ్డు మ్యాప్‌తో పుట్ట లేదు. మనకు సరైంది అనిపించిన మార్గంలో ముందుకు సాగుతున్నాం. మనమంతా మానసికంగా బాధలు పడుతుంటాం.. అయినా ఫర్వాలేదు. కొందరు సాయం కోసం బయటపడి ఏడుస్తుంటారు, కొందరు లోలోపలే కుమిలిపోతుంటారు. కొందరు పరధ్యానంలో ఉంటారు, కొందరు తమదైన మార్గాల్ని ఎంచుకుంటారు, కొందరు నిస్సహాయంగా ఉంటారు’…అని ఎంతో పరణతితో కూడిన మాటలు చెప్పారు. ఇంకా ఆమె ఏమన్నారంటే..
‘ఇంకా దయతో జీవిద్దాం. ఇతరుల మాటల్ని విందాం, వారిని ప్రేమిద్దాం. బలంగా ఉందాం. మనమంతా మనుషులం. ఓ నవ్వు, మాటల్ని వినే గుణం, ఆప్యాయతతో కూడిన స్పర్శ.. ఎదుటి వ్యక్తి జీవితంలో ఎంతో మార్పును తెస్తుంది. మనం ప్రతి సమస్యకు పరిష్కారం చూపలేకపోవచ్చు. కానీ ఓ చిన్న చొరవ ఎంతో మార్పును తెస్తుంది. మార్పనేది నెమ్మదిగానే మొదలవుతుంది’ అని ఆమె పోస్ట్ చేశారు.
నిజంగా ఎంతో జీవితానుభవం నుంచి పుట్టుకొచ్చిన ఆణిముత్యాల్లాంటి మాటలు అనుష్క పోస్ట్ చేశారు. కష్టాల్లో ఉన్న వాళ్లకి ఇవి ఎంతో సాంత్వన కలిగిస్తాయి. మాటే మంత్రం అంటే ఏంటో అనుష్క పోస్టే ఓ ఉదాహరణ. అవును, ఏ సమస్యకూ ఆత్మహత్య పరిష్కారం చూపదు.