భారత్ శాంతికే ప్రాధాన్యమిస్తుందని.. కాదని ప్రత్యర్ధులు కవ్వింపులకు పాల్పడితే తగిన రీతిలో గుణపాఠం చెప్పేందుకు సిద్ధమని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణల నేపథ్యంలో ఆయన చైనాకు గట్టి హెచ్చరికలు పంపారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన సైనికుల త్యాగాలు వృధా కానీయమని అన్నారు. కరోనాపై రాష్ట్రాల ముఖ్యమంత్రులతో జరిగిన సమీక్షలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
గాల్వాన్ లో అమరులైన సైనికులకు నివాళిగా ప్రధానితో పాటు ముఖ్యమంత్రులు 2 నిమిషాల మౌనం పాటించారు. దేశ ఐక్యత, సార్వభౌమాధికారానికి అత్యంత ప్రాధాన్యమిస్తామని తెలిపారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు దేశం సిద్ధంగా ఉందని తెలిపారు. లఢక్‌లోని గాల్వన్ లోయలో భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణల్లో 20 మంది భారత సైనికులు అమరులైన విషయం తెలిసిందే.
అయితే.. దీనిపై చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి జావో లిజియన్ స్పిందిస్తూ.. తప్పంతా భారత్ దే అని వాదిస్తున్నారు. దాడి జరిగిన ప్రాంతం చైనా భూభాగంలో ఉందని.. తప్పెవరిదో తెలుస్తోందన్నారు. కమాండర్ స్థాయిలో చర్చలు జరిగిన తర్వాత కూడా భరత దళాలు తమ భూభాగంలోకి వచ్చాయని అన్నారు. భారత్ తమ దళాలను అదుపులో ఉంచుకోవాలని అన్నారు. ఇప్పటికీ తాము చర్చల ద్వారా శాంతి యత్నాలకు సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. కవ్వింపు చర్యలు ఎవరికీ మంచివి కావని తప్పుని భారత్ మీదకు నెట్టే ప్రయత్నం చేశారు.
ఈ అంశంపై జూన్ 19న ప్రధాని మోదీ అఖిలపక్ష భేటీకి పిలుపునిచ్చారు. ఈ సమావేశం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరుగనుంది. ఇందులో అన్ని పార్టీల అధ్యక్షులు పాల్గొని తగిన సలహాలివ్వాలని ప్రధాని కార్యాలయం కోరింది.