ఇప్పుడు స్టార్ హీరోల అభిమానుల మధ్య వార్ మొత్తం సోషల్ మీడియా వేదికగానే నడుస్తోంది. ఇంతకుముందు 100 రోజుల సెంటర్ల.. తర్వాత వసూళ్ల విషయంలోనే రికార్డులు, అభిమానుల మధ్య పోటీ ఉండేది. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో వ్యూస్, లైక్స్, హ్యాష్ ట్యాగ్ ట్రెండ్స్.. వీటి లెక్కల్లో హీరోల గొప్పదనాన్ని కొలుస్తున్నారు.
ఈ విషయంలో ఒక బ్యాండ్ ట్రెండ్‌ను మొదలుపెట్టింది తమిళ అభిమానులే. హీరోల పుట్టిన రోజులతో మొదలుపెడితే.. సినిమాతో సంబంధం లేని ఎన్నో ట్రెండ్స్ మొదలుపెట్టి అదే పనిగా ట్వీట్లు వేయడం.. టీజర్లు, ట్రైలర్లకు పనిగట్టుకుని వ్యూస్ తెప్పించడం, లైకులు కొట్టడం.. దీనికి డబ్బులు ఖర్చు పెట్టడం.. బాట్స్ కొనడం లాంటి దుస్సంప్రదాయాలకు తెరతీసింది తమిళ అభిమానులే. ముఖ్యంగా చెప్పాలంటే విజయ్, అజిత్ అభిమానులు ఈ ఒరవడిని పెంచి పోషించారు.
ఐతే వాళ్ల నుంచి అందిపుచ్చుకున్న టాలీవుడ్ ఫ్యాన్స్.. గత కొన్నేళ్లలో బాగా ముదిరిపోయారు. ఇప్పుడు తమిళ అభిమానులు మన వాళ్ల ముందు దిగదుడుపు అనిపిస్తున్నారు. మన హీరోల పుట్టిన రోజులకే కాదు.. బర్త్ డేకు నెల రోజులుండగా కౌంట్‌డౌన్ కోసం పెట్టే ట్రెండ్స్ విషయంలోనూ రికార్డుల కోసం పోటీ నడుస్తోంది. వీటిలో మనవాళ్లు ఆరితేరిపోయారు. రికార్డుల మీద రికార్డులు కొడుతున్నారు.
గత నెలలో ఎన్టీఆర్ పుట్టిన రోజు నాడు రికార్డు స్థాయిలో 14 మిలియన్ల దాకా ట్వీట్లు పడ్డాయి. దానికి కౌంట్‌డౌన్‌గా నెల కిందట కూడా 8 మిలియన్లకు పైగా ట్వీట్లు వేయడం విశేషం. ఇప్పుడు మహేష్ అభిమానులు దానికి దీటుగా వన్ మంత్ కౌంట్‌డౌన్‌లో ట్వీట్లు వేశారు.
ఐతే సోమవారం విజయ్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు 10 మిలియన్ ట్వీట్లు మాత్రమే వేయగలిగారు. కోలీవుడ్ వరకు మాత్రమే అది రికార్డు. సౌత్ ఇండియా రికార్డు మనవాళ్ల పేరిటే ఉంది. ఇలాంటి ట్రెండ్స్ అలవాటు చేసిన తమిళ అభిమానులు ఇలా వెనుకబడిపోవడం ఆశ్చర్యమే.